🔳సర్వం.. సర్వర్కష్ట కాలం
ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులకు ఇబ్బంది
సర్వం.. సర్వర్కష్ట కాలం
ఈనాడు-గుంటూరు: బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులకు సర్వర్ తలనొప్పిగా మారింది. కోరుకున్న పాఠశాలకు బదిలీ అయ్యే సంగతి దేవునికి ఎరుక! కనీసం తాము పలానా పాఠశాలలో ఖాళీ కోరుకోవటానికి ఆప్షన్లు ఇచ్చుకోవటానికి వెబ్సైట్ సక్రమంగా పనిచేస్తే చాలనుకుంటున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వం ముందస్తుగా బ్లాక్‌చేసిన ఖాళీలను ఉపసంహరించుకుంటుందని ఆశించి గడువు తేదీ సమీపించే వరకు మెజార్టీ ఉపాధ్యాయులు ఆప్షన్ల జోలికి వెళ్లలేదు. తీరా ప్రభుత్వం ఆ పోస్టుల విషయంలో ముందుగా చెప్పిన నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేయటంతో బదిలీ దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఉపాధ్యాయుడికి ప్రస్తుతం ఐచ్ఛికాలు ఇచ్చుకోక తప్పటం లేదు. ఒకవేళ వారు ఐచ్ఛికాలు ఇవ్వకపోతే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటమే కాదు.. ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ పాఠశాలకు బలవంతంగా పంపుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆప్షన్లు ఇచ్చుకోవటానికి కంప్యూటర్లు ముందు గంటల తరబడి సర్వర్ కోసం ఎదురుచూశారు.
మొన్న రాత్రి నుంచే..
సోమవారం రాత్రి నుంచే సర్వర్ మొరాయిస్తోంది. అది మంగళవారం నాటికి తీవ్రరూపం దాల్చింది. మంగళవారంతో ఆప్షన్లు ఇచ్చుకోవటానికి గడువు ముగియనుండటంతో సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆప్షన్లు ఇచ్చుకోవటానికి ప్రయత్నించారు. జిల్లా వ్యాప్తంగా 5884 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సోమవారం సాయంత్రం వరకు 2086 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు మరో 1200 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తంగా 3328 మంది దరఖాస్తులు మంగళవారం సాయంత్రానికి అప్డేట్ అయ్యాయని జిల్లా విద్యాశాఖవర్గాలు తెలిపాయి. గడువు పొడిగించరేమోనని ఒక్కసారిగా సోమవారం రాత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఆప్షన్లు ఇవ్వటానికి ప్రయత్నించటంతో సర్వర్ ఆరోజు రాత్రి 10 గంటల నుంచి పూర్తిగా మొరాయించింది. ఒక్కసారిగా దానిపై ఒత్తిడి పడటం వల్లే దాని వేగం తగ్గిందని సాంకేతిక సమస్యలు ఏమీ లేవని అధికారులు అంటున్నారు. ప్రతి ఒక్కరికీ వచ్చిన పాయింట్ల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని కేటగిరీ 1,2,3,4 లో ఉన్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. కేటగిరీ 1,2ల్లో ఉండే పాఠశాలలు నగరపాలక, మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, వాటికి 8 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలు దాని పరిధిలోకి వస్తాయి. కేటగిరీ 3లోనే 95 శాతానికి పైగా పాఠశాలలు ఉంటాయి. కేటగిరీ-4 అంటే కనీసం రహదారి, బస్సు సౌకర్యంలేని ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు దాని పరిధిలోకి వస్తాయి.
ఇవిగో ఇక్కట్లు..
* ఎంతో శ్రమకోర్చి 3-4 గంటలు కష్టపడి ఆప్షన్లు మొత్తం గుర్తించి తుదగా సబ్మిట్ నొక్కగానే ఆ వివరాలు బ్లాంకుగా రావటం చూసి ఉపాధ్యాయులు కంగుతింటున్నారు. తిరిగి నమోదు చేయాలని(రీ ఎంటర్) కంప్యూటర్లో చూపుతోంది. మళ్లీ అన్ని ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలని బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం వేగం తక్కువుగా ఉండటంతో అక్కడ ఉపాధ్యాయులకు అసలు మంగళవారం సాయంత్రం దాకా చాలా పాఠశాలల్లో సైట్ తెరుచుకోలేదని తెలిసింది.
* మండలాల జాబితా వస్తుంది తప్పిస్తే పాఠశాలల వివరాలు రాక మరికొందరు సమస్యలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా నమోదుచేసిన వివరాలు మొత్తం తిరిగి మరోసారి పరిశీలించుకోవటానికి చాలా సేపు ప్రివ్యూ ఓపెన్ కాలేదు. దీంతో నమోదుచేసిన వాటిల్లో తప్పులు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించుకోకుండానే సబ్మిట్ నొక్కామని పలువురు ఉపాధ్యాయులు చెప్పారు. సబ్మిట్ అయ్యాక వాటిని డౌన్‌లౌడ్ చేసుకోవటానికి ఆప్షన్ ఫారం రావటం లేదు.
* కొందరికి సబ్మిట్ సక్సెస్ అని వచ్చినా ఆ వివరాలను డౌన్లోడ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తే నాట్ సబ్మిటెడ్ అని వస్తోందని మరికొందరు ఉపాధ్యాయులు గుర్తు చేశారు.
* ఎడిట్ చేసుకునేటప్పుడు తొలుత ఎంపిక చేసిన పాఠశాలల వివరాలన్నీ కనిపించటం లేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
అధికారులు చేతులెత్తేశారు
సర్వర్ పనిచేయటం లేదని జిల్లా విద్యాశాఖ అధికారుల దృస్టికి తీసికెళితే వారు చేతులెత్తేశారు. ఇది తమ స్థాయిలో పరిష్కరించేది కాదని సున్నితంగా చెప్పి తప్పుకున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచి ఆమేరకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుండేది. సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించటానికి టెక్నికల్ టీంను అందుబాటులో ఉంచలేదు.
0 comments:
Post a comment