✍అమ్మఒడి అనర్హతతెలిసేదెలా ?
● ‘అమ్మఒడి’ లబ్ధిదారుల్లో అయోమయం
● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
♦డీఈవో కార్యాలయంలోని ఐటీ సెల్
🌻న్యూస్‌టుడే, ఒంగోలు నగరం : జనవరి 9న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. దీనికి సంబంధించి అన్ని యాజమాన్యాల పరిధిలో ఒకటి నుంచి పది తరగతులు చదువుతున్న విద్యార్థుల జాబితాను మంగళవారం ప్రకటించారు. అర్హతలుండీ అనర్హుల జాబితాలో పేర్లుంటే గురువారంలోగా సచివాలయాల్లో తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సరిచేయించుకోవాలని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.
ఆన్‌లైన్ లింక్ ఏదీ...
అర్హుల జాబితాలో లేని వారు తగిన పత్రాల సమర్పణకు ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా వెబ్‌సైట్ లింక్ ఏర్పాటు చేస్తామని, సచివాలయాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సహాయకులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆ ప్రకారం వెళ్లిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. ఇంతవరకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. గురువారంతో గ్రీవెన్స్‌కు సమయం ముగిసిపోతుంది. దీనికితోడు అనర్హతకు కారణాలు పేర్కొనలేదు. మొత్తం ఆరు రకాల అంశాల్లో మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే అమ్మఒడి దక్కుతుంది.
♦ఇవి ఉంటేనే...
కుటుంబ ఆదాయం గ్రామీణంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు. మాగాణి అయితే 3, మెట్ట, మాగాణి కలిపి అయితే 10 ఎకరాల్లోపు ఉండాలి. విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటరాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు అనర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు అనర్హులు. ఆస్తి వెయ్యి చదరపు అడుగులలోపు ఉండాలి. వీటికి సంబంధించి పొరపాటున జాబితాలో చేరకపోతే ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలో ఇస్తే ఆర్డీవో కార్యాలయానికి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు పంపిస్తారు. అక్కడ పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. లోపాల్లేవని నిరూపించుకోవడానికి సంబంధిత శాఖల నుంచి పత్రాలు పొందాలి. అంటే నాలుగు చక్రాల వాహనం లేదని ఆర్టీవో నుంచి పత్రం తెచ్చుకోవాలి. లబ్ధిదారుల సందేహాలు తీర్చడానికి అధికారులు ఎవరి వద్దా సమాచారం లేదు. విత్‌హెల్డ్‌లో ఉంచిన వారికి సైతం ఎందుకు ఆ విభాగంలో ఉంచారో కూడా తెలియడం లేదు.
అమ్మఒడి పథకం జాబితాలో అనర్హుల విభాగంలో ఉన్న లబ్ధిదారులకు కాళ్లతిప్పట తప్పడం లేదు. తమ పిల్లల పేర్లు ఎందుకు తొలగించారో, అనర్హతకు కారణాలేమిటో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సచివాలయాలు, జిల్లా, మండల విద్యాశాఖ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.
♦31 వరకు సవరణలకు అవకాశం
అర్హతలుండీ అమ్మఒడి జాబితాలో పేర్లు చేరని వారు తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వీఎస్ సుబ్బారావు తెలిపారు. సాంకేతిక కారణాలవల్ల బుధవారం ఆన్‌లైన్ లింక్ పెట్టలేదన్నారు. గురువారం నుంచి అది అందుబాటులో ఉంటుందని, అనర్హత కారణాలూ తెలియజేస్తారని చెప్పారు. జాబితాను సచివాలయాలు, హెచ్‌ఎం లాగిన్‌కు పెడతారని, ఈ నెల 28న గ్రామసభలు జరిపి అనర్హులుంటే తొలగించాలని సూచించారు. కొందరు ఉద్యోగుల పిల్లల పేర్లూ జాబితాలో చేరినట్లు సమాచారం అందిందని, గ్రామసభలో జాబితాలను నిశితంగా పరిశీలించి అనర్హులుంటే తొలగించాలని ఆదేశించారు. అర్హులుంటే తగిన పత్రాలు సమర్పించి చేర్చాలన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల జాబితా విషయంలో కరస్పాండెంట్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. గ్రామసభల్లో ఆమోదించిన తుది జాబితాలను నెలాఖరు నాటికి అందించాలని కోరారు.
♦ఇదీ పరిస్థితి...
1-10 తరగతుల విద్యార్థులు : 5,26,237
అమ్మఒడికి అర్హులు : 4,64,394
అనర్హులు : 54,724
విత్‌హెల్డ్‌లో ఉన్న వారు : 7,119
0 Comments:
Post a Comment