Atal Pension Yojana: అసంఘటిత రంగంలో పనిచేసేవారి ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojna- APY) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణను దృష్టిలో ఉంచుకొని దీంట్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ పథకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో భాగంగా ప్రభుత్వమే లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల చొప్పున అందించేది. ఇప్పుడు ఎన్‌పీఎస్ స్థానంలో అటల్ పెన్షన్ యోజనను తీసుకువచ్చారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. దీంట్లో కనీసం 20 సంవత్సరాలు డిపాజిట్లు చేయవచ్చు.
60 ఏళ్లు నిండిన తరువాత లబ్ధిదారులకు నెలకు రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
APY వినియోగదారులకు ఆధార్ కార్డుతో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ ఉండాలి. ఈ పథకంలో ప్రీ మెచూర్ పెన్షన్ పేమెంట్, ఎగ్జిట్ ఆప్షన్ లేవు. కానీ తీవ్రమైన అనారోగ్యాల బారిన పడినప్పుడు, లేదా లబ్ధిదారుడు చనిపోయినప్పుడు నిధులు తీసుకోవచ్చు. చిన్నవయసులోనే ఈ పథకంలో చేరినవారు తక్కువ పెట్టుబడులతో, ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేవారికి సేవింగ్స్ అకౌంట్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అన్ని నేషనల్ బ్యాంకులూ అటల్ పెన్షన్ యోజనను అందిస్తాయి. ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే కస్టమర్లు APYలో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో, బ్యాంకుల్లో కూడా లభిస్తాయి. వీటిని నింపి, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో కలిపి సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో ఇవ్వాలి. బ్యాంకులు అప్లికేషన్‌ను ఆమోదించిన తరువాత కస్టమర్లు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ SMS వస్తుంది.
కాంట్రిబ్యూషన్ (పథకంలో పెట్టుబడి) ఎంత?
ఈ పథకంలో చేరిన లబ్ధిదారుడి వయసుపై కాంట్రిబ్యూషన్ ఆధారపడి ఉంటుంది. పెన్షన్ స్లాబ్ రూ.1000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. ప్రతి నెలా లేదా ఆరునెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాంట్రిబ్యూషన్ డిపాజిట్ చేసే ఆప్షన్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సులోనే ఈ పెన్షన్ పథకంలో నమోదు చేసుకుంటే.. నెలకు కేవలం రూ.42 మాత్రమే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 40 ఏళ్ల వయసులో నమోదు చేసుకుంటే.. నెలకు రూ.229 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది పెన్షన్ స్లాబ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు.. 18 ఏళ్ల వ్యక్తి రూ.5,000 పెన్షన్ స్లాబ్‌ను ఎంచుకుంటే.. నెలకు రూ.210 చొప్పున చెల్లించాలి. ఇదే స్లాబ్‌ను 40ఏళ్ల వ్యక్తి ఎంచుకుంటే.. నెలకు రూ.1,454 చొప్పున కాంట్రిబ్యూషన్ వర్తిస్తుంది.
గడువు ప్రకారం చెల్లించకపోతే?
సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లో ఆటో డెబిట్ ఆప్షన్‌ను ఎంచుకొని కస్టమర్లు సులభంగా కాంట్రిబ్యూషన్ చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోతే జరిమానా విధిస్తారు. కాంట్రిబ్యూషన్ విలువపై జరిమానా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల వరకు పథకంలో డిపాజిట్ చేయకపోతే.. అకౌంట్ హోల్డ్‌లో పడుతుంది. ఒక సంవత్సరం వరకు కాంట్రిబ్యూషన్ చెల్లించకపోతే అకౌంట్ డీ యాక్టివేట్ అవుతుంది. రెండేళ్ల వరకు కూడా కస్టమర్లు పట్టించుకోకపోతే.. సంబంధిత అకౌంట్‌ను మూసివేస్తారు.
0 Comments:
Post a Comment