ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించింది. వాస్తవానికి ఆమె జూన్ 30న రిటైర్ కావాల్సి ఉంది. కానీ, జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆమె రిటైర్ కావడానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు కొత్త సీఎస్ రాక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనే చర్చ సీనియర్ ఐఏఎస్‌లలో జరుగుతోంది. కొత్త సీఎస్ రేసులో ఆదిత్యనాథ్ దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆదిత్యనాథ్ దాస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ప్రస్తుత సీఎస్ పదవీ కాలం ముగిసే రోజు కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడతాయి. ఆ దిశగా కొన్ని మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎస్ కార్యాలయంలో అదనపు బాధ్యతలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. నెలాఖరు వరకూ ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీకి కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సొంత రాష్ట్రం బీహార్. తల్లిదండ్రులు డాక్టర్ గౌరీ కాంత్ దాస్, కుసుం కుమారి. 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. ఇక నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు
0 Comments:
Post a Comment