AP Govt: రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డుల తొలగింపు.. 8లక్షల మందికి షాక్
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఏకంగా 8.44 లక్షల కార్డులను తొలగించింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త బియ్యం కార్డులపై నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 1 నుంచి గత నెలరోజుల్లో 8.44 లక్షల కార్డులను తొలగించారు. కార్డు క్యాన్సిల్ అయిన వారికి సరుకు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో అదేంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కొత బియ్యం కార్డుల ద్వారానే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.
కరోనాతో బ్రేక్ ఐతే కరోనా రావడంతో ప్రభుత్వం ప్రయత్నాన్ని విరమించుకుంది. లాక్ డౌన్ సమయం నుంచి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం కావడంతో పాత రేషన్ కార్డుల ఆధారంగానే నవంబర్ నెలాఖరువరకు ఉచిత రేషన్ పంపిణీ చేసింది. ఈనెల నుంచి పాత రేషన్ కార్డాలను పక్కనబెట్టి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 52లక్షల 70వేల రేషన్ కార్డులుండగా.. వాటిలో 8లక్షల 44వేల కార్డులను వివిధ కారణాల వల్ల అధికారులు తొలగించారు. ప్రస్తుతం కార్డుల సంఖ్య ఒక కోటి 44లక్షల 26వేలకు తగ్గింది.
కారణాలేంటి..?
కార్డులు తొలగించడానికి ప్రధాన కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలకు పైగా ఆదాయం ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా సొంత కార్లు ఉన్నవారు, వ్యవసాయ భూములు కూడా ఎక్కువగా ఉన్నవారు, ఆదాయపన్నులు చెల్లిస్తున్నవారి కార్డులను తొలగించింది. కార్డులు రద్దయిన వారు తమ పూర్తి వివరాలును గ్రామ/వార్డు సచివాలయాల్లో సమర్పిస్తే మరోసారి పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
కొత్త ఏడాది కొత్త రూల్స్..
రేషన్ పంపిణీలో ఉన్న నిబంధనల్ని కూడా ప్రభుత్వం మార్చేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రేషన్ తీసుకోవాలంటే వారికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వలంటీర్లు సరుకులు అందజేసిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వలంటీర్లు సర్వర్ లో ఎంటర్ చేసిన తర్వాతే సంబంధిత కుటుంబానికి సరుకులు అందినట్లు లెక్క.
0 Comments:
Post a Comment