సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేస్ కేడర్ కు మారిన ఆమె కొన్నాళ్లు వెయిటింగ్ లో ఉన్నారు. తాజాగా చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో ఆమెకు కీలకమైన మున్సిపల్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న J.శ్యామలరావును జలవనరుల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకు కేటాయించింది. వాస్తవానికి ఆమె స్వస్థలం విశాఖపట్నం.., హైదరాబాద్ పోస్టల్ అడ్రస్ కారణంగా కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది.
అప్పటి నుంచి సొంతరాష్ట్రానికి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేశారు. ఐతే 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. శ్రీలక్ష్మికి వైఎస్ కుటుంబంతో ఉన్న సఖ్యత కారణంగా చంద్రబాబు ఆమెను ఏపీకి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. జగన్ గెలుపుతో ఆశలు
గతేడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో శ్రీలక్ష్మీ మళ్లీ ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏపీకి పంపేందుకు కేంద్రం నిరాకరించింది. ఐతే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(CAT)ను ఆశ్రయించిన ఆమె.. పోస్టల్ అడ్రస్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి రైల్వే జాబ్ కారణంగా.. తాము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని.. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.
అప్పట్లో ఆమే కీలకం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షీణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి.
డిప్యూటేషన్ కోసం ఏడాదిన్నరగా యత్నిస్తున్నా.. సెక్రటరీ స్థాయి అధికారులను అలా పంపడం కుదరదని స్పష్టం చేసింది.చివరకు క్యాట్ ను ఆశ్రయించి విజయం సాధించారు. క్యాట్ అదేశాలతో తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా ఉన్న ఆమె ఏపీకి బదిలీ అయ్యారు.
0 comments:
Post a comment