🔳ఉద్యోగాల గ్యారేజ్
● యువతకు ఉచిత గ్రంథాలయం
● ప్రభుత్వ కొలువులు సాకారం
● ఆదర్శం ఫ్రెండ్స్ అసోసియేషన్ బృందం
ఉద్యోగాల గ్యారేజ్
ఆదోనిలోని గణేశ్ రాయ్‌చంద్ గ్రంథాలయం
గ్రంథాలయం అంటే జ్ఞానాన్ని అందించే దేవాలయంగా పేరుంది. ఇక్కడ ఎంతో మంది జ్ఞానార్జన సాగిస్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఆదోనిలోని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ రాయ్‌చంద్ గ్రంథాలయం ఏర్పాటైంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఉద్యోగుల తయారీ కేంద్రం అని చెప్పవచ్ఛు ఇక్కడ పుస్తకాలు చదివిన ఎంతో మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. -న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం, ఆదోని విద్య
ఆదోనికి చెందిన కొందరు స్నేహితులు కలిసి తమ వంతుగా యువతకు సేవలు అందించాలనుకున్నారు. 1998లో ఫ్రెండ్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఆ తర్వాత నిరుద్యోగ యువత కోసం ఓ అద్దె గదిలో చిన్న గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇక్కడి పుస్తకాలు విద్యార్థులకు, యువతకు ఉద్యోగ సాధనలో ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు ఎక్కడున్నా.. సేకరించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నారు.
దాత స్పందించి.. భవనం విరాళం
అసోసియేషన్ సభ్యులు యువత కోసం అందిస్తున్న సేవలను గుర్తించిన ఆదోనికి చెందిన వ్యాపారవేత్త రాయ్‌చంద్ మానాజీ గ్రంథాలయం కోసం 2000 సంవత్సరంలో సొంత ఖర్చులతో గణేశ్ కూడలి వద్ద భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుంచి అద్దె కష్టాలు తప్పి సొంత భవనంలో గ్రంథాలయం నడుస్తోంది.
రెండు వేలకు పైగానే పుస్తకాలు
పోటీ పరీక్షల విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఎంత ఖరీదైన పుస్తకాలున్నా.. కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా రైల్వే, బ్యాంకింగ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, రక్షణ శాఖ, నేవీ తదితర పోటీ పరీక్ష పుస్తకాలు సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో పాటు దినపత్రికలు, వార, మాస పత్రికలను సమకూరుస్తున్నారు. 2 వేలకు పైగానే పుస్తకాలు ప్రత్యేక అరల్లో ఏర్పాటు చేశారు. రోజూ వంద మంది వరకు పాఠకులు ఉంటున్నారు. ఆదోనికి చెందిన గణేశ్ ప్రతాప్ బ్యాంకింగ్ రంగం వైపు ఉద్యోగాలకు వెళ్లేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.
సహకరిస్తే.. మరింత అభివృద్ధి : నాగరాజు, అధ్యక్షుడు, ఫ్రెండ్స్ అసోసియేషన్
నిరుద్యోగ యువతకు సేవలు అందించాలన్న లక్ష్యంతో స్నేహితులంతా కలిసికట్టుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. మా సేవలను వినియోగించుకుని 1998వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు దాదాపు 600 నుంచి 700 మంది వరకు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఇది మాకు మరింత ఉత్సాహాన్ని అందిస్తోంది. దాతలు సహకరిస్తే గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
సేవలు మరువలేనివి: మాణ్కార్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ బ్రాంచి మేనేజరు, ఇండియన్ బ్యాంకు, ఆదోని
గణేశ్ రాయ్‌చంద్ మానాజీ గ్రంథాలయం అందిస్తున్న సేవలు మరవలేనివి. నిరుద్యోగ యువతకు దేవాలయంగా నిలిచింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో రోజూ గ్రంథాలయానికి వెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఇప్పుడు ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సాధించా.
యువతకు మార్గదర్శనం: జిందే మహేష్, అకౌంట్స్ ఆఫీసరు, ఈపీఎఫ్, కర్ణాటక
డిగ్రీ పూర్తి చేసిన రోజుల్లో గ్రంథాలయంలోనే దాదాపు మూడు గంటల పాటు గడిపేవాడిని. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉద్యోగ అన్వేషణ చేశా. ఇక్కడ శిక్షణ తీసుకోవడం వల్లే ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ఫండ్ కార్యాలయంలో ఉద్యోగం సాధించాను. ఈ రుణం తీర్చుకోలేనిది
0 comments:
Post a comment