కరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు పెరగిపోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో గత ఏడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గుబులు రేపుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 38,772 కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం సిబ్బందికి సెలవు కావడంతో టెస్టులు తక్కువగా చేపట్టడంవల్లే కొత్త కేసుల సంఖ్యా తక్కువగా వచ్చింది. దేశంలో మొత్తం కేసులు 94.44లక్షలకు, మరణాల సంఖ్య 1.37లక్షలకు చేరింది. సెకండ్ వేవ్ భయాలు, కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై కేంద్రం కీలక అడుగులు వేస్తోంది..
4న అఖిలపక్ష భేటీ..
దేశంలో కరోనా పరిస్థితులు మారుతుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెంకండ్ వేవ్ ఛాయలు ఇప్పటికే ప్రస్పుటం కావడం రాబోయే తీవ్రతకు సంకేతమని నిపుణులు హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాల్లో రాత్రి వేళ కర్ఫ్యూల వంటి నిర్ణయాలను అమలు చేస్తున్నారు. కేంద్రం చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ శుక్రవారం భేటీ అవుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ భేటీలో ప్రధాని.. అందరి అభిప్రాయాలను తెలుసుకుని, కేంద్రం వెర్షన్ ను వివరిస్తారు. కాగా.
మళ్లీ లాక్ డౌన్ అంటూ..
దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించేందుకు గాను డిసెంబర్ 4న ప్రధాని నేతృత్వంలో జరగనున్న ఆల్ పార్టీ మీటింగ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మినిస్టర్ అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పార్టీ నాయకులను సంప్రదించినట్లు సమాచారం. ఆల్ పార్టీ మీటింగ్ వార్తలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నారనే ప్రచారం గుప్పుమంది. యూరప్ దేశాల్లో రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతున్నందున, భారత్ లోనూ అలాంటి పరిస్తితే తలెత్తవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ భారత్ లో రెండో దశ లాక్ డౌన్ ఉండబోదని కేంద్ర పెద్దలు ఇదివరకే స్పస్టం చేశారు. ఒక సారి లాక్‌డౌన్‌కే అర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో రెండో లాక్ డౌన్ ను దేశం తట్టుకోలేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు,
వ్యాక్సిన్‌పై కేంద్రం గుడ్‌న్యూస్
అఖిలపక్ష భేటీలో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపైనా ప్రధాని మోదీ.. అన్ని పార్టీలకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం శుభవార్త చెప్పారు. 2021 జూలై, ఆగస్ట్ నాటికి 30 కోట్ల మంది భారతీయులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, 2021 జనవరి నుంచి మూడునాలుగు నెలల పాటు దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే అవకాశాలపై దృష్టి పెట్టామని మంత్రి పేర్కొన్నారు. తద్వారా సరిపడా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైంది.
కొవిడ్‌పై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి నిల్వలు, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతటా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితిని పర్యవేక్షించాలని గౌబా చెప్పారు. డిసెంబరు 6వ తేదీ నాటికి ఆయా రాష్ర్టాలు రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీలు, టాస్క్‌ఫోర్స్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
0 comments:
Post a comment