మూణ్నెల్ల కోసం వేస్తే .. 31 నెలల సమయం
ఇదీ తెలంగాణ పీఆర్సీ కథ
రూ . 15 కోట్ల ఖర్చు
మూడుసార్లు గడువు పొడిగింపుఈనెలాఖరుతో పూర్తికానున్న గడువు
నేడు లేదా రేపు సీఎస్‌కు నివేదిక
♦️30 న సీఎంతో ఉద్యోగ సంఘాల భేటి.
మూణ్నెల్ల కాలానికి ఆ సంఘాన్ని నియమిస్తే .... అది ఏకంగా 31 నెలలపాటు కొనసాగింది.
ఈ కాలంలో మూడుసార్లు ప్రభుత్వం దాని గడువును పొడిగించాల్సి వచ్చింది . ఇప్పటిదాకా ఆ సంఘం నిర్వహణ కోసం దాదాపు రూ .15 కోట్ల ఖర్చయినట్టు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి . ఈ నెలాఖరు నాటికి ఆ కమిటీ గడువు పూర్తి కానుంది . అదే వేతన సవరణ సంఘం ( పీఆర్సీ ) . తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కోసం మొట్ట మొదటిసారిగా 2018 మే 18 న పీఆర్సీని వేశారు . విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ సారథ్యంలో మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ఆధి కారులు సి.ఉమామహేశ్వరరావు , మహ్మద్ అలీ రఫత్ సభ్యులుగా ఇది ఏర్పాటైంది . వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడు నెలల్లోగా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలంటూ అప్పటి ఉత్తర్వులో పేర్కొన్నారు . పీఆర్సీ తన నివేదికను రూపొందించే క్రమంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను , వనరులను , రాష్ట్ర ఖజానాపై ఎప్పటికప్పుడు ప్రభావం స్వల్పకాలిక , దీర్ఘకాలిక పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ సీఎం సూచించారు .
ఒక్కొక్కరికి రూ .2 నుంచి 3 లక్షల వేతనంతోపాటు ఆఫీసు సబార్డినేట్లు , కార్యాలయ , వ్యక్తిగత సిబ్బంది , వాహనాలు , ఆఫీసు నిర్వహణ తదితర సౌకర్యాలను కల్పించారు . సీఎం సూచన మేరకు పలు రాష్ట్రాల్లో కమిషన్ పర్యటించింది . ఈ లెక్కన ఒక్కోనెల్లో సుమారు రూ .40 నుంచి రూ .50 లక్షల వరకూ ఇందుకోసం వెచ్చించినట్టు తెలిసింది . ముందుగా మూడు నెలల్లోనే నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించినా .. కమిషన్ సమయం తీసుకోవటంతో గడువును పెంచుతూ వచ్చారు . ఆ క్రమంలో 31 నెలల సమయం గడిచింది . ఈ కాలంలో వేతన సవరణ అంశాలతోపాటు గతేడాది ఉద్యోగుల విభజనలాంటి అంశాల పరిశీలనను కూడా పీఆర్సీకి అప్పగించారు . ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్సీయే ఇప్పటికీ అమల్లో ఉంది . ఈ క్రమంలో తాజా పీఆర్సీ పదకొండోది . అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి పీఆర్సీ ... బిశ్వాల్ సారధ్యంలోనిదేనని టీఆర్ఎస్ సర్కార్ స్పష్టీకరించింది . ఆనవాయితీ ప్రకారం 2018 జులై ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది.
0 comments:
Post a comment