🔳భారీ సంస్కరణలకు ఈసీ శ్రీకారం
18 ఏళ్లు నిండగానే ఓటరుగా నమోదు
సర్వీస్ ఓటర్ల కుటుంబ సభ్యులకూ
సర్వీసు ఓటర్లుగా నమోదుకు అవకాశం
అందుబాటులోకి ఈ-ఓటర్ కార్డు
భవిష్యత్తులో ఆన్‌లైన్ ఓటింగ్‌కు అవకాశం
వచ్చే సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు’
న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కీలక సంస్కరణలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. త్వరలో ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయనుంది. 18 ఏళ్లు వయస్సు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోడానికి అవకాశం కల్పించడంతో పాటు సర్వీస్ ఓటర్ల జీవిత భాగస్వాములకూ అదే ప్రదేశంలో ఓటరుగా నమోదు చేసుకునే చాన్స్ ఇవ్వనుంది. అలాగే, ఈ-ఓటర్ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ నాలుగు సంస్కరణలను 2021 మొదట్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. అందులో మూడింటికి ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951ను సవరించాల్సి ఉంటుంది. బోగస్ ఓట్లు, డూప్లికేషన్ ఓట్లను ఏరివేయడానికి ఓటర్ కార్డుతో ఆధార్ లింకేజీ ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎలకా్ట్రనిక్ లేదా ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్ ప్రవేశ పెట్టడానికి ఈ రెండు కార్డులు లింక్ చేయడం కీలకమని ఈసీ భావిస్తోంది.
లింకేజీకి సంబంధించి గతేడాది డిసెంబరులో జరిగిన చర్చల్లో ఓటర్ల ఆధార్ వివరాల గోప్యత, భద్రత వంటివి పరిరక్షించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, 18 ఏళ్ల వయస్సు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం ప్రతీ ఏటా జనవరి 1 వరకు అన్న ప్రాతిపదికన ఓటరుగా నమోదు చేసేవారు. ఈ విధానాన్ని మార్చడానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14-బిని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. సీఆర్‌పీఎఫ్, బీఎ్‌సఎఫ్, సీఐఎ్‌సఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే వారిని సర్వీస్ ఓటర్లుగా ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. వారు పని చేస్తున్న చోట ఓట్లు వేసుకోవచ్చు. పురుషులు అయితే... వారి భార్యలకూ అక్కడే ఓటేసే సదుపాయం ఉంది. మహిళా సర్వీస్ ఓటర్ల భర్తలకు అలాంటి అవకాశం లేదు. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 20(6)ను సవరించి మహిళా సర్వీస్ ఓటర్ల భర్తలు, పిల్లలు కూడా సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోడానికి వీలు కల్పించనుంది. ఈ-ఓటర్ కార్డును ప్రవేశపెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను ముమ్మరం చేసింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25న ఈ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు మంత్రివర్గం కూడా ఆమోదించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment