Water Tree in Montenegro: యూరప్ దేశం మాంటెనెగ్రోలో ఉంది ఆ చిత్రమైన చెట్టు. అక్కడి దినోసా గ్రామానికి వెళ్లి అడ్రెస్ అడిగితే.... ఆ చెట్టు ఎక్కడుందో ఊరి ప్రజలు చెబుతారు. అది 365 రోజులూ నీరు ఇవ్వదు. చెట్టు ఉన్న ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు... వర్షం తగ్గినా... చెట్టు కాండం నుంచి నీరు ధారలా, చిన్న సైజు జలపాతంలా బయటకు వస్తూ ఉంటుంది. అది మల్బరీ చెట్టు. చాలా పెద్దది. ఇలా జరగడానికి దైవ రహస్యమో, ప్రకృతి వింతో కాదు... చెట్టు లోపల భూమిలో... నీటి బుగ్గలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు వాటి నుంచి నీరు పైకి ఉబుకుతూ ఉంటుంది. ఫలితంగా చెట్టు వేర్లు, కాండం నుంచి నీరు పైకి వస్తూ... అక్కడున్న చిన్న తొర్ర నుంచి బయటకు కారుతోంది.
ఇదంతూ చూడటానికి మనకు చిత్రంగా ఉంటుంది.
ఇదే కాదు... ఇలాంటి చెట్లు అక్కడక్కడా ఉన్నాయి. కామెరూన్ లోని బుయాలో మరో చెట్టు ఉంది. అది కూడా అంతే... దాని కాండానికి చిన్న కన్నం పెడితే చాలు... అక్కడి నుంచి నీరు ధారలా బయటకు చిమ్ముతుంది. ఆ నీటిని తాగవచ్చు కూడా. అదో రకం జాతి చెట్టు. ఈ తరహా చెట్లు... నీటిని తమ కాండాలలో దాచుకుంటాయి. ఎండాకాలంలో ఆ నీటిని వాడుకుంటాయి.
ఇండియాలోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి. అవే క్రొకడైల్ బార్క్ ట్రీ (మొసలి తోలు చెట్టు). వాటి సైంటిఫిక్ పేరు టెర్మినలియా ఎల్లిప్టికా (Terminalia Elliptica). ఇవి ఎండాకాలంలో నీటిని దాచి ఉంచుతాయి. చెట్టు బెరడును పగలగొడితే... చెట్టు కాండంలోంచీ నీరు ధారలా బయటకు వస్తుంది. ఈ చెట్టు బెరడు... మంటల్ని అడ్డుకోగలదు. అంటే ఈ చెట్టుకి మంటలు అంటవు. అందువల్ల ఎండాకాలంలో అడవుల్లో తిరిగే అధికారులకు... ఈ చెట్లు నీటిని అందిస్తాయన్నమాట.
ఇలాంటి ప్రకృతి చిత్రాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడు మనకు ఒకింత ఆశ్చర్యంగా... భలే ఉందే అనిపిస్తూ ఉంటుంది.
0 comments:
Post a comment