Nimmagadda Ramesh Kumar: మరోసారి నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ రద్దు.. ముదురుతున్న వివాదం
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్వహించతలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దయింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో రద్దయ్యింది. అయితే ఇందుకోసం ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పి సిఇఒలు, జిల్లా పంజాయతీ అధికారులతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని లేఖలో ప్రస్తావించారు. అందుకు తగ్గట్లు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసుకుందని వెల్లడించారు.
అయితే గురువారం కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.
వారు తమ కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని భావించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రయత్నం మరోసారి విఫలైమంది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తమకు సహకరించడం లేదంటూ గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏపీ ఎస్ఈసీ... మరోసారి ఈ అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా స్పందించలేదని కోర్టులో ప్రస్తావించే యోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు సమాచారం. దీంతో ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎస్ఈసీ భావిస్తున్నట్టు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో.. ఈ అంశంపై ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది.
0 comments:
Post a comment