Good news for contract lecturers .. KCR will provide opportunity in those colleges
కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త.. ఆ కాలేజీల్లో అవకాశం కల్పిస్తామన్న కేసీఆర్
జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆక్ష్న ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్షా సమావేశం జరిగింది. జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... '' జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వారిని రెగ్యలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయింది. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేసింది.
సంవత్సర కాలానికి కేవలం పదినెలలు మాత్రమే జీతాలు చెల్లించే పరిస్థితి గతంలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పన్నెండు నెలలకు పెంచి సంవత్సర కాలం పూర్తి జీతం ఇస్తోంది. దాంతో పాటు వారికి సర్వీసు బెనిఫిట్స్‌ను కూడా అందిస్తున్నాం. సెలవులను పెంచాం. కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవుల సదుపాయాలను కల్పించాం. ఇంకా సాధ్యమైనంత మేరకు, నిబంధనలు అనుమతించిన మేరకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.'' అని స్పష్టం చేశారు.తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే జూనియర్ కాలేజీ లెక్చరర్ల విజ్జప్తులను పరిగణలోకి తీసుకుని నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి, అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సిఎం కేసీఆర్ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a comment