Dr Ravindra Kolhe, an MBBS graduate from Maharashtra.
In an era where success is measured by the size of one’s bank balance, how many of us can find self-actualisation by living a life that the society perceives as ‘below average’? With the option to hoard fancy degrees, work at large multinational corporations, and travel the world, how many of us would choose to settle in a tribal area and dedicate our lives to people with whom we do not share our DNA?
But dedicating his life to the tribals of Melghat is the only thing that brings peace to Dr Ravindra Kolhe, an MBBS graduate from Maharashtra.
గుడి అవసరంలేని దేవుళ్ళు !
వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా?
కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి.
వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.
1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర , MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే '' అని మనకు వివేకానందుడు చెప్పలేదా ? '' వివేకానంద , గాంధీ , వినోబా భావేల జీవితాలు , ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.
ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో '' నేను మారుమూల పల్లెల్లోని పేదలను డాక్టరు గా సేవించేందుకు వెళతాను.'' తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర, మహరాష్ట్ర లో అత్యంత వెనుకబడిన అయిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు. అదే ఎందుకు ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు Where There Is No Doctor. వ్రాసినది David Werner. ఆపుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూవుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా Hospital 30 kms away అని వ్రాసివుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించివుంటూంది. అలా వైద్య సౌకర్యాలు ఏవీ లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన అనుకొన్నాడు. తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ. జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి : 1. Sonography or Blood Transfusion లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం , 2. X-ray లేకుండా న్యుమోనియా కు వైద్యం చేయడం , 3. డైఏరియా కు వైద్యం చేయడం. 6 నెలలు ముంబాయి లోవుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర. వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. అమరావతి [ మహరాష్ట్ర] నుండి 40 కి.మి. నడచివెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిశె వేసుకొని అక్కడి రోగులకు వైద్యం చేసేవాడు. ఆ పల్లె పేదరికం , నిరక్షరాస్యత , వ్యాధులతో నిండివుంది. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరు అయిన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకొన్న యువతినే తాను పెళ్ళిచేసుకొంటాను అని. 1. 40 కి.మీ. నడవగలగాలి. 2. 5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. [ 1989 లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అట అది ] 3. కేవలం 400 వందరూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. [ ఎందుకంటే డా. రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి తీసుకొంటాడు ]4. అవసరమైతే ప్రజలకోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి. 100 సంబంధాలు వచ్చినా , ఈ షరతులు చూసాక 99 మంది వెళ్ళిపోయారు. ఒక యువతి సరేనంది. ఆమె పేరు డా. స్మిత [ ఫోటో లో వున్న వ్యక్తి]
1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర. కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ' మీ ఇష్టం ' అంది. '' ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే , ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు '' అని పల్లెప్రజలకు చెప్పాడు. డా. స్మిత '' మీరే నాకు వైద్యం చేయండి , నగరం వద్దు , '' అనింది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు ఆది దంపతుల్లాగా లాగా కనిపించారు.
నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు. ఏడాది లో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పనివుండదు. కాబట్టి ఆహారం కొరత , డబ్బు కొరత , దాని కారణంగా రకరకాల వ్యాధులు. ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు , అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ ఆలోచించి , ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండిగింజలు వీళ్ళే పండించుకోవాలి. అందుకోసమని డా. రవీంద్ర నగరంలోవుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడితో సలహాలు తీసుకొని , విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా క్రిమి , కీటకాలను ఎదుర్కొనగలిగే కొత్త , ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు. దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును '' నీవు నగరం లో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ? '' అని అడిగితే '' అలాగే , మీరు ఎలా అంటే అలా, '' అన్నాడు కొడుకు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట భూమి దున్నితాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి , చక్కటి పంట తీసి పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డా. రవీంద్ర. ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు.ఇపుడు తిండికి లోటుండదు , రెండుపూటలా తిండి కారణంగా , ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లె లో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండిన యువతీ యువకులు ఏడాది కి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది.
ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లె లో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి [ గతంలో - ఇపుడు కాదు ] ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర , డా. స్మిత , వాళ్ళ కుమారుడు రోహిత్ లు చేస్తున్న పని చూసి చాలా సంతోషించి , '' మీరున్న ఈ చిన్న గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను '' అంటే అందుకు వాళ్ళు అన్నారు : '' మాకు ఇదే చాలు , కానీ ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసేవిధంగాను , పల్లె లోపలానూ రోడ్లు వేయించండి.'' సరే అన్నాడు మంత్రి. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి , ఆ పల్లె ఆధారంగా నడిచే 6 పాఠశాలున్నాయి , 12 వైద్యకేంద్రాలున్నాయి. కానీ సర్జరీ లు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డా. రవీంద్ర తన రెండవకొడుకు రాం ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తీ చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.
కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు , పేదలగుండెలే గర్భగుడులు.
మన ఇళ్ళలో , పాఠశాలల్లో , కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పం. చెప్పాలి. మామూలుగా కాదు , హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు.
0 comments:
Post a comment