వీధిన పడ్డ గురువు : గొర్రెల్ని కాస్తున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్..
Karnataka college lecturer herds sheep : కరోనా దెబ్బకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. వీరిలో చదువు చెప్పే గురువుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. విద్యాసంస్థలన్నీ మూసివేయటంతో వాటిపై ఆధారపడి జీవించేవారంతా నడిరోడ్డుమీద పడ్డారు. విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు కూరగాయాలు అమ్ముకుంటూ..వీధి వీధి తిరిగుతూ చీపులు..టీలు, టిఫెన్లు అమ్ముకుంటూ జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో పనీలేక సంపాదన లేక జీతాల్లేక వీధినపడ్డారు. ప్రభుత్వ కాలేజీలు కూడా మూతపడినా ఉద్యోగులకు ప్రభుత్వం జీతం చెల్లిస్తుండటంతో వారికి పెద్దగా సమస్యలు లేవు.
బతలేని బడిపంతులు అనే మాట ఈ కరోనా రోజుల్లో బతకటానికి పంతుళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఈక్రమంలో కర్నాటకలో ఓ లెక్చరర్ మాత్రం గొర్రెలు..మేకల కాపరిగా మారాడు. కర్నాటకలోరి రాయిచూరు జిల్లా లింగసూగూర్ మండలం హల్లిగడ్డ గ్రామానికి చెందిన వీరన్న గౌడ అనే లెక్చరర్ M.A, B.Ed పూర్తి చేశారు.
KSET, KTET పరీక్షల్లో అర్హత సాధించారు. అనంతరం మస్కి ప్రాంతంలో ఉన్న దేవనాంప్రియ గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో నెలకు రూ.13వేల జీతానికి టెంపరరీ లెక్చరర్‌గా పనిచేసేవారు. అలా అదే కాలేజీలో తొమ్మిదేళ్లుగా పనిచేసినా పర్మినెంట్ చేయలేదు.
వీరన్న గౌడకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, సోదరులు కలిపితే వీరి కుటుంబంలో మొత్తం 9 మంది ఉంటారు. వారందరూ వీరన్న సంపాదనే ఆధారంగా జీవిస్తున్నారు.మార్చి నుంచి కాలేజీలు మూతపడడంతో అందరితో పాటు వీరన్న పరిస్థితి వీధిన పడింది. చేతిలో పైసా లేక అప్పు పుట్టే దారికూడా లేక దిక్కుతోచని పరిస్థితిలో గొర్రెల కాపరిగా మారాడు వీరన్న గౌడ. ఓ వ్యక్తికి చెందిన గొర్రెలు కాస్తూ రోజుకు రూ. 200 సంపాదిస్తున్నారు.
ఆయన భార్య పత్తి కూలీగా మారింది. రోజుకి రూ.150 సంపాదిస్తోంది. ఈ డబ్బుపైనే తాము బతుకుతున్నామని.. లాక్డౌన్ సమయంలో అప్పులు కూడా చేశామని చెప్పారు వీరన్న గౌడ.
మరోవైపు తన తల్లి కంటి సమస్యలతో బాధపడుతుందోని.. ఆమె కంటి ఆపరేషన్ చేయించాలని ఈ పరిస్థితుల్లో అది కాస్త భారమే కానీ కన్నతల్లిని చూసుకోని కొడుగ్గా నేను ఉండలేను ..ఆమె ఆపరేషన్ కోసం రూపాయి రూపాయి కూడబెడుతున్నామని ఆవేదనగా చెప్పాడు వీరన్న.
కాంట్రాక్ట్ లెక్చరర్ల, ప్రైవేట్ లెక్చరర్ల కోసం ప్రభుత్వ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని వీరన్న గౌడ వేడుకుంటున్నాడు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ బతుకులు ఊహించటానికి భయంగా ఉందని వాపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక్క వీరన్న గౌడ పరిస్థితే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల అందరి పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. వారందరినీ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని వేడుకుంటున్నారు.
0 comments:
Post a comment