🔳జేఈఈ మెయిన్, నీట్‌లకు సిలబస్ తగ్గింపు లేదు! త్వరలో పరీక్షల తేదీలను ఖరారు చేయనున్న ఎన్టీఏ
ఈనాడు, హైదరాబాద్: ఈసారి జేఈఈ మెయిన్, నీట్‌లకు సంబంధించి పాఠ్య ప్రణాళిక తగ్గించడం లేదు. గత ప్రవేశ పరీక్షల సిలబస్సే ఉండనుందని తెలిసింది. ఆ పరీక్షలను నిర్వహించే జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) వచ్చే కొద్ది రోజుల్లో పరీక్షల తేదీలతో పాటు సిలబస్ వివరాలను వెల్లడించనుంది. కరోనా కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డులు 12వ తరగతిలో సిలబస్‌ను తగ్గించాయి. కొన్ని అధ్యాయాలను మొత్తం తొలగించకుండా ఆయా పాఠాల్లో కొన్ని అంశాలు, భావనలను తొలగించాయి. వాటినే ఆయా రాష్ట్ర బోర్డులు అనుసరిస్తున్నాయి. ఎంపీసీ, బైపీసీ సిలబస్ తొలగింపులో సీబీఎస్ఈనే అనుసరిస్తామని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఈసారి జరిగే జేఈఈ మెయిన్, నీట్‌కు కూడా పాఠ్యప్రణాళిక తగ్గిస్తాయని విద్యార్థులు భావిస్తున్నారు. ఎన్టీఏ మాత్రం సిలబస్‌ను అన్ని బోర్డులు తగ్గించకపోవడంతో దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇంటర్లో కొన్ని భావనలను తొలగించి పరీక్ష జరిపితే విద్యార్థులు బీటెక్‌లో చేరాక అర్థం కాక ఇబ్బంది పడతారని ఎన్టీఏ అధికారవర్గాలు యోచిస్తున్నట్లు సమాచారం. తొలి జేఈఈ మెయిన్‌ను ఫిబ్రవరి చివరలో అది వీలుకాకుంటే మార్చి మధ్యలో జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సిలబస్‌పై జేఈఈ నిపుణుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. 12వ తరగతిలో సీబీఎస్ఈ తొలగించిన సిలబస్‌లో కొంత భాగాన్ని రాష్ట్ర విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చదువుతారని చెప్పారు. దానివల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై పెద్దగా ప్రభావం ఉండదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్‌కు దాదాపు 1.50 లక్షల మంది దరఖాస్తు చేస్తారు.
0 comments:
Post a comment