గండం గడిచేనా?
♦వేతనాలు, పెన్షన్లకు డబ్బుల్లేవు
♦రుణాలపై బ్యాంకులతో భేటీలు
♦అవి కరుణిస్తేనే చెల్లింపులకు దారి
♦ఉద్యోగుల డీఏ చెల్లింపు నిలిపివేత
🌻అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):* రాష్ట్రంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇంత వరకు వేతనాలు, పెన్షన్లు అందలేదు. ఖజానాలో పైసా కూడా లేకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఒక్క నెల జీతమూ అందుకోలేకపోయారు. అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ నెల ప్రారంభమై వారం గడుస్తున్నా వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు, అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకులతో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో ఆ 5 బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. శనివారం ఖజానాలో ఆ నిధులు జమ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అవి అందితే సోమవారం నుంచి పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందే వీలుంది.
♦చెల్లించలేం: ఆర్థిక శాఖ
ప్రస్తుత రేట్లతో జూలై 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. అదేవిధంగా జనవరి 1, 2020 నుంచి వారికి ఇవ్వాల్సిన డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
0 comments:
Post a comment