ఈసారి అమెరికా ఎన్నికలు తమిళనాడులోని రెండు గ్రామాలకు అత్యంత ప్రత్యేకంగా నిలిచాయి. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విజయమే దీనికి కారణం. కమలా హారిస్ అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామాలు తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉన్నాయి. ఆమె తాతయ్య పి.వి.గోపాలన్ స్వస్థలం తుళసేంద్రపురం కాగా.. అమ్మమ్మ రాజమ్ ఇక్కడి పైంగనాడువాసి. మాజీ దౌత్యవేత్త పి.వి.గోపాలన్ పెద్ద కుమార్తె శ్యామల సంతానమే కమలా హారిస్. ఆమె విజయంతో రెండు గ్రామాల ప్రజలు దీపావళికి ముందే సంబరాలు చేసుకోవాలని ఏర్పాట్లు చేశారు. మన్నార్గుడి నుంచి తుళసేంద్రపురం, పైంగనాడు వెళ్లే రహదారులలో ఫ్లెక్సీలతో పాటు గోడపత్రికలను అంటించారు.
భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిష్ కావడం విశేషం. ఇక ఈ పదవిని దక్కించుకున్న తొలి నల్ల జాతీయురాలు కూడా ఆమె కావడం మరో రికార్డ్. డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ బరిలో ఉండటంతో.. ప్రవాస భారతీయుల ఓట్లు ఎక్కువగా డెమొక్రటిక్ పార్టీకి పడ్డాయనే వాదన కూడా ఉంది. ఇక కమలా హారిస్ విజయంతో తమిళనాడులోని ఆమె తల్లి సొంత ఊరులో సంబరాలు మొదలయ్యాయి.
0 comments:
Post a comment