గురుకులాల్లో బుడగ వ్యూహం
♦ఐదుగురి చొప్పున విద్యార్థులతో బృందాలు
♦కరోనా లక్షణాలు కనిపిస్తే ఉంచేందుకు ప్రత్యేక ఐసొలేషన్ గది
🌻ఈనాడు డిజిటల్- అమరావతి: కరోనా విస్తృతి దృష్ట్యా రాష్ట్రంలోని గురుకులాల్లో ‘బుడగ వ్యూహం’(బబుల్ స్ట్రాటజీ)ని అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా పర్యవేక్షించేందుకు దీన్ని అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి తరగతిలోని విద్యార్థుల్ని ఐదుగురు చొప్పున జట్టుగా విభజిస్తారు. తరగతి గది, వసతి గృహంలో ఒక బృందంలోని విద్యార్థులు ఇతరులతో సంబంధం లేకుండా కచ్చితంగా దూరంగా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ నెల 23 నుంచి గురుకులాల్లో 9, 10, ఇంటర్ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు తరగతుల ప్రారంభానికి ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించారు. ప్రతి తరగతిలోనూ విద్యార్థుల మధ్య కచ్చితంగా 6 అడుగుల దూరంగా ఉండేలా ‘జడ్’ ఆకారంలో 16 మందిని మాత్రమే కూర్చోబెడతారు. వసతి గృహంలోని ప్రతి విద్యార్థి పడక మధ్య కచ్చితంగా ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఏ విద్యార్థిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఇతరులకు దూరంగా ఉంచేందుకు ప్రతి గురుకులం ప్రాంగణంలోనూ ‘ఐసొలేషన్ గది’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 9, 10, ఇంటర్ విద్యార్థులకే తరగతులు ప్రారంభిస్తున్నందున విద్యార్థుల మధ్య కనీస దూరం ఉండేలా సిబ్బందితో తరగతి గది, వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వారిపై ప్రత్యేక దృష్టి
* కొవిడ్ వ్యాప్తి, చలికాలం దృష్ట్యా అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న కొందరు విద్యార్థుల్ని ముందుగానే గుర్తించారు. ఇలాంటి వారిపై ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తారు.
* డైనింగ్ హాల్లో విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా ఒక్కో తరగతికి 20 నిమిషాల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు.కేటాయించిన సమయంలోనే విద్యార్థులు భోజనం చేయాలి. ఇక్కడా బుడగ వ్యూహం అమలుచేస్తారు.
* పిల్లల్ని వారి తల్లిదండ్రులు నెలలో ఒక్కసారి మాత్రమే కలిసేలా సమయం కేటాయిస్తారు. ఒక్కో ఆదివారం ఒక్కో తరగతి విద్యార్థులకు గురుకులం ప్రాంగణంలోని ప్రత్యేక గదిలో తల్లిదండ్రుల్ని కలిసేందుకు అనుమతిస్తారు.
* విద్యార్థులు ప్రతి రోజూ కచ్చితంగా ఆరుసార్లు చేతులు శుభ్రం చేసుకునేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున చేతులు శుభ్రం చేసుకునే తాత్కాలిక కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
* ఎవరైనా విద్యార్థికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే స్పందించేందుకు గురుకులానికి ఒకటి చొప్పున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయుడు, స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఆరోగ్య పర్యవేక్షకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి బృందంలో ఉంటారు. పల్స్ ఆక్సీమీటర్, థర్మల్ స్కానర్లు, ఔషధాలతో కూడిన కిట్‌ను ప్రతి గురుకులానికీ పంపించారు.
* ఉదయం పూట ప్రార్థన కార్యక్రమాలను రద్దు చేశారు. తరగతి గదుల్లోనే వీటిని నిర్వహిస్తారు. విద్యార్థులకు కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన వచ్చేలా ప్రతి రోజు 15 నిమిషాల పాటు ‘కొవిడ్ ప్రతిజ్ఞ’ చేయిస్తారు.
* ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వంట సిబ్బంది విద్యార్థులతో కలిసేందుకు అవకాశం లేకుండా పర్యవేక్షిస్తారు.
0 comments:
Post a comment