వీడని భయం
♦ఉపాధ్యాయులు, విద్యార్థులకు సోకుతున్న కరోనా
♦పారిశుద్ధ్యంపై కానరాని శ్రద్ధ..!
♦ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష
🌻ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, కలెక్టరేట్
విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండున్నర వారాలు గడిచాయి. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పాఠశాలలకు వెళ్లాలంటే అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు వెనుకాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల హాజరు శాతం కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
జాగ్రత్తలు తీసుకోక తప్పదు
🌻ప్రస్తుతం విద్యార్థులు వాడుతున్న తరగతి గదులను ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేస్తే వైరస్ వ్యాప్తికి కొంతవరకూ అడ్డుకట్ట వేయడానికి అవకాశాలున్నాయి. ఈ విధానం అమలవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. తరచూ తరగతి గదుల శానిటేషన్పై ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వైరస్ రెండోసారి విజృంభించే ప్రమాదం ఉందని, మరో కొన్ని నెలలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తూ వస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు వచ్చే పాఠశాలల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. విద్యార్థుల్లో ఒకరి నుంచి మరొకరికి సోకిన వైరస్ వెంటనే వారి కుటుంబ సభ్యులకూ సోకడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
♦వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట ఎలా..
పాఠశాలలో ఒకరికి కొవిడ్ ఉందని తేలితే ఆ తరగతిలో ఉండే విద్యార్థులందరి నుంచీ నమూనాలు సేకరించి పరీక్షించాల్సి ఉంది. అప్పుడే మిగిలిన విద్యార్థులకు తద్వారా వారి తల్లిదండ్రులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించినట్లవుతుంది. అయితే అధికారులు మాత్రం పాజిటివ్ వచ్చిన విద్యార్థికి సన్నిహితంగా మెలిగిన వారి నుంచి మాత్రమే నమూనాలు సేకరిస్తున్నారు. మిగిలిన వారి నుంచి తీసుకోవడం లేదు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
♦రోజూ కొత్త కేసులు..!!
నవంబరు 2న పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ కొవిడ్ పరీక్షలు జరిగాయి. అప్పుడే కొందరికి పాజిటివ్రాగా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ బారినపడి కోలుకున్నవారు మరోసారి పరీక్ష చేయించుకుని నెగిటివ్ వస్తే విధులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు నిరాటంకంగా నడుస్తున్న వేళ కొత్తగా నమోదయ్యే కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ప్రస్తుతం 9, 10వ తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు. విద్యార్థులంతా ఒకే గదిలో పాఠాలు వింటున్నారు. వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే కొందరికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన వారిలో లక్షణాలు బయటపడితేనే నమూనాలు తీసుకుంటున్నారు. ఈలోపు ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యులకు కొవిడ్ సోకే ప్రమాదాలు లేకపోలేదు.
♦పరీక్షలు చేయిస్తున్నాం...- చంద్రకళ, డీఈవో
జిల్లాలో ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం. ప్రతి పాఠశాల నుంచి రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు, పది మంది విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి కొవిడ్ పరీక్షలు చేయిస్తున్నాం. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారితో సన్నిహితంగా మెలిగిన వారికీ పరీక్షలు చేయిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు పాఠశాలలకు రావొద్దని చెబుతున్నాం. పూర్తిగా కోలుకున్న తర్వాత కొవిడ్ నెగెటివ్ వస్తేనే పాఠశాలల్లోకి అనుమతిస్తున్నాం. తరగతి గదుల శానిటేషన్ పైనా దృష్టి పెడతాం.
0 comments:
Post a comment