నవంబరు30లోపు సీట్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు వాపసు
♦విద్యార్థులకు వారం రోజుల్లోపు ధ్రువపత్రాలతో సహా ఇచ్చేయాలి
♦టెక్నికల్ కోర్సులపై ఏఐసీటీఈ నిర్దేశం
🌻ఈనాడు, దిల్లీ: ఈనెల 30 లోపు ఇంజినీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సుల్లో (పీజీడీఎం/పీజీసీఎం మినహా) సీట్లు రద్దు చేసుకున్న విద్యార్థులకు ఫీజు పూర్తిగా వాపసు చేయాలని ఏఐసీటీఈ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రాసెసింగ్ ఫీజు కింద గరిష్ఠంగా రూ.వెయ్యి మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యా సంవత్సర క్యాలెండర్ను సవరించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆగస్టు 13న జారీచేసిన క్యాలెండర్లోని తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. ఇదివరకు టెక్నికల్ కోర్సుల సీట్ల రద్దుకు నవంబరు 10 చివరి తేదీ కాగా ఇప్పుడు దాన్ని నవంబరు 30 వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఖాళీ సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఇదివరకు నవంబరు 15 గడువుగా ఉండగా, ఇప్పుడు డిసెంబరు 5 వరకు పొడిగించినట్లు తెలిపింది. తరగతుల ప్రారంభ తేదీని నవంబరు 1 నుంచి డిసెంబరు 1కి మార్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో నవంబరు 30 లోపు సీట్లు రద్దుచేసుకున్న విద్యార్థులందరికీ పూర్తి ఫీజు తిరిగి చెల్లించడంతోపాటు, వారి టీసీలు కూడా వెనక్కు ఇచ్చేయాలని స్పష్టంచేసింది. ఒకవేళ విద్యార్థి నవంబరు 30వ తేదీ తర్వాత సీటు రద్దుచేసుకున్నా, ఆ ఖాళీ సీటు డిసెంబరు 5 లోపు భర్తీ అయితే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.వెయ్యితోపాటు, ఆ విద్యార్థి కాలేజీకి వచ్చినంతమేరకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు మినహాయించుకొని మిగిలిన మొత్తం ఫీజును తిరిగి చెల్లించాలని ఏఐసీటీఈ నిర్దేశించింది. ఒకవేళ ఆ సీటు డిసెంబర్ 5లోపు భర్తీ కాకపోతే సదరు విద్యార్థికి ధరావతు సొమ్ము, ధ్రువపత్రాలు వెనక్కి ఇచ్చేయాలని పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తదుపరి సెమిస్టర్/సంవత్సరాలకు ఫీజు డిమాండ్ చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఫీజు, డాక్యుమెంట్లను వారం రోజుల్లోపు విద్యార్థికి ఇచ్చేయాలని తెలిపింది.
0 comments:
Post a comment