దిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)కు ఏపీ సీఎం రాసిన లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 16న విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్లను చేర్చింది. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టనుంది. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ సింగ్, సునీల్‌కుమార్ సింగ్‌తో పాటు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టులపై ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని సునీల్‌కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ అంశంలో చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పేందుకు సీఎం జగన్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేయడంపై జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేసినందుకు సీఎంగా జగన్‌ను తొలగించాలని కోరారు.
మరోవైపు ఈ వ్యవహారంలో సీఎం జగన్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు తనకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఇప్పటికే అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్‌కి లేఖ రాశారు. అయితే ఆ విషయం ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నందున కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వలేనంటూ అశ్వినీకుమార్‌కు ఏజీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అశ్వినీకుమార్ గురువారం ఏజీకి మరో లేఖ రాశారు. ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖే తప్ప.. అది కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందంటూ తాను చేసిన ఫిర్యాదు కాదని, అందువల్ల కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వాలని ఆయన కోరారు.
0 comments:
Post a comment