పదేళ్ల క్రితం ఇతరులకు డబ్బులు జమ చేయాలన్నా, అకౌంట్ లో ఉన్న డబ్బులను తీసుకోవాలన్నా బ్యాంకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటితో పోలిస్తే ఏటీఎంల వినియోగం చాలా తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్ పే, ఫోన్ పే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రజలు సులభంగా డిజిటల్ లావాదేవీలు చేయగలుగుతున్నారు. రోజురోజుకు వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది.
గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా లావాదేవీలు జరిగితే ఏదో ఒక రూపంలో క్యాష్ బ్యాక్ లను కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులను బోల్తా కొట్టించి వాళ్ల ఖాతాలలో డబ్బులను మాయం చేస్తుండటం గమనార్హం.
గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లకు స్క్రాచ్ కార్డులు లభిస్తాయి. ఈ స్క్రాచ్ కార్డుల ద్వారా కొంత నగదు రివార్డు రూపంలో మన బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు యాప్ వాడుతున్న వినియోగదారులకు గూగుల్ పే రివార్డ్ వచ్చినట్టు మెసేజ్ లు పంపి గూగుల్ పే ను పోలి ఉండే నకిలీ పేజీలను ఆన్ లైన్ లో సృష్టిస్తున్నారు. అక్కడ స్క్రాచ్ కార్డులు కనిపించేలా చేసి ఆ కార్డులను స్క్రాచ్ చేసిన వారికి పెద్ద మొత్తంలో నగదు వచ్చినట్టు చూపించి మన గూగుల్ పేకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొబైల్ కు వచ్చిన ఫేక్ మెసేజ్ లను, ఫేక్ స్క్రాచ్ కార్డులను నమ్మితే మన ఖాతాలలోని డబ్బులు మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూగుల్ పే నుంచి అరుదుగా మాత్రమే పెద్ద మొత్తంలో రివార్డులు లభిస్తాయి. అందువల్ల ఎక్కువ మొత్తం రివార్డులను చూసి ఆశ పడి మన వివరాలు అందజేస్తే మాత్రం మనం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0 comments:
Post a comment