Are the schools opening possible from November 2 ?
ఏపీ సర్కారు నవంబర్ 2నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ సైతం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాజా అన్ లాక్ మార్గదర్శకాల్లో పాఠశాలలు తెరుచుకునే విషయంలో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలదే నిర్ణయమని తేల్చేసింది. అక్టోబరు 15 తర్వాత ఆయా రాష్ర్టాలు వారి వీలు ప్రకారం పాఠశాలలు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అక్టోబరు 21 నుంచే రాష్ర్టంలో ఎగువ తరగతి విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు పాఠశాలలు తెరిచారు. ఉపాధ్యాయులు సగం సగం మంది రోజు విడిచి రోజు పాఠశాలలకు వెళ్తున్నారు. ఆ ప్రభావం, దాని పరిణామాలు తాజాగా వెలుగు చూశాయి. విజయనగరం జిల్లా లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకడంతో కలకలం రేగింది. గంట్యాడ, దత్తి రాజేరు మండలం దత్తి జిల్లా ప్రజాపరిషత్తు పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు అనుమానిత లక్షణాలు ఉండటంతో వారికి కోనా పరీక్షలు నిర్వహించారు. గంట్యాడ ఉన్నత పాఠశాలలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. దత్తిరాజేరు మండలం దత్తి ఉన్నత పాఠశాలలో 100 మందికి పరీక్షలు చేయగా 8 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి రాష్ర్ట ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశారు. దీంతో పాఠశాలల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతం రెండు పాఠశాలల్లో జరిగిన ఈ పరిణామంపై రాష్ర్ట వ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో చర్చకు దారి తీసింది. పాఠశాలల్లో కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటికే జారీ చేశారు. అయితే అత్యధిక స్కూళ్లలో జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. విద్యార్థులు కొన్ని చోట్ల మాస్కులు కూడా లేకుండా గుంపులుగాను పాఠశాలల వద్ద కనిపిస్తున్నారు. మరో వైపు రాష్ర్టంలో ఇప్పటికీ రోజూ 5000 కు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరవడం, సందేహాల నివృత్తి పేరుతో పాఠశాలలకు విద్యార్థులను రమ్మనడం ఎంతవరకు శ్రేయస్కరమన్న చర్చ సాగుతోంది.
0 comments:
Post a comment