924 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు..హాజరు వేయనందుకు డీఈవో చర్యలు
ములుగు, అక్టోబరు 9: ములుగు జిల్లాలోని 924 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి ఈ నెల 6న షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఉద్యోగుల అనధికార గైర్హాజరును తగ్గించేందుకు పూర్వ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రవేశపెట్టిన 'ములుగు-వెలుగు' అటెండెన్స్ యాప్ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది. విధులకు హాజరైన ఉద్యోగులు తమ పనిప్రాంతం నుంచి సెల్ఫీ తీసుకొని ఉదయం, సాయంత్రం యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా పనిప్రదేశంలో లేకుండా సెల్ఫీ దిగాలనుకుంటే ఔట్‌సైడ్ ఆప్షన్ ఇచ్చి అటెండెన్స్ వేయడం సాధ్యం కాదు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ యాప్‌ను అనుసరించడంలేదని, సెప్టెంబరు 21 నుంచి యాప్‌లో హాజరు వివరాలను నమోదు చేయడంలేదని కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య గుర్తించారు.
వారందరినుంచి వివరణ తీసుకోవాలంటూ డీఈవో వాసంతిని ఆదేశించారు. డీఈవో వాసంతి జిల్లాలో పనిచేస్తున్న 924 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 6న షోకాజ్ నోటీసులు జారీచేశారు.
ప్రభుత్వ సూచనల మేరకే..!
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యంగా సెప్టెంబరు 21 నుంచి పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రతీరోజు 50శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని సూచించింది. మిగతావారు ఇంటివద్దనుంచే విద్యార్థులను మానిటరింగ్ చేయాలని పేర్కొన్నప్పటికీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేయడమేంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విషయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి దృష్టికి టీఎ్‌స-యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాల నాయకులు శుక్రవారం తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారని, ఉపాధ్యాయులెవ్వరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆ సంఘాల నాయకులు దూపటి కిరణ్‌కుమార్, ఏళ్ల మధుసూదన్‌లు పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం కారణంగా 'ములుగు-వెలుగు' యాప్‌లో అటెండెన్స్ వేయలేకపోయామని రాతపూర్వక వివరణ ఇస్తే సరిపోతుందని వారు తెలిపారు.
0 comments:
Post a comment