ప్రాథమిక విద్యకుప్రాధాన్యం ఇదేనా..!
ఇంగ్లీషు మీడియం పోస్టులూ లేవు
20 వేల ఖాళీలు చూపించని వైనం
ఉపాధ్యాయ సంఘాల సూచనలు బేఖాతరు
నేడు మరోసారి నాయకులతో డైరెక్టర్ భేటీ
🌻విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :
ఈ ఏడాది జూలైలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యా యులతోపాటు ఉపాధ్యాయ బదిలీలు చేపడతా మని జూన్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అప్పటికే రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న కరోనా వైరస్ ప్రభావమో, మార్గదర్శకాల రూపకల్పనలో జరిగిన జాప్యమో తెలియదుగానీ నాలుగు నెలల తర్వాత మార్గదర్శకాలు, బదిలీ షెడ్యూల్ విడుదలైంది. మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మార్గదర్శకాలపై పెదవి విరుస్తున్నారు. ఉపాధ్యాయులకు తీవ్రనష్టం కలిగించిన వెబ్ కౌన్సెలింగ్ విధానం వద్దని మొదటి నుంచి ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నా, ప్రభుత్వం వారి సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 2015లో వెబ్ కౌన్సెలింగ్ వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులకు నష్టం జరగడంతో 2017లో మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాలలో మళ్లీ వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీలు చేపడతామని పేర్కొనడంపై సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిపైనా ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ప్రభుత్వం మార్గదర్శకాలలో చేర్చలేదు. సంఘాలతో చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు విడుదల చేశామని ప్రభుత్వం చెప్పడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ (డీఎస్ఈ) వాడ్రేవు చినవీరభద్రుడు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో సర్దుబాటు ప్రక్రియను చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే 60మంది విద్యార్థులున్న స్కూళ్లకు రెండు పోస్టులు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. అప్పటికీ అది సహేతుకం కాదని, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక పోస్టు మంజూరు చేయాలని సూచించారు. గతంలో 19 మంది విద్యార్థులుంటే ఒక పోస్టును, 20 – 60కి రెండు, 61-80కి మూడు, 81మందిపైబడి విద్యార్థులున్న స్కూళ్లకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు 130 మంది మించితే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఉండేది. తాజా మార్గదర్శకాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాకుండా 60 మందికి రెండు, 61-90కి మూడు, 91-120కి నాలుగు, 120-150కి ఐదు పోస్టులు, 151-200కి ఐదు ఎస్జీటీ పోస్టులతోపాటు హెచ్ఎం పోస్టును ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడటంతోపాటు ఎస్జీటీ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
♦60కి రెండు..200లోపు తొమ్మిదా..!
విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో ఒక్కోచోట ఒక్కో విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 200 మంది విద్యార్థులున్న హైస్కూళ్లకు హెచ్ఎం సహా తొమ్మిది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అదే ఆరు, ఏడు తరగతులున్న ప్రాథమికోన్నత స్కూల్లో 100 మందిలోపు విద్యార్థులుంటే నాలుగు పోస్టులు కేటయించగా, ప్రాథమిక పాఠశాలలో 90 మందిలోపు విద్యార్థులుంటే మూడు, 120లోపుంటే నాలుగు పోస్టులు ఇవ్వనున్నారు. ఇక్కడే ఉపాధ్యాయ నియామకాలలో ప్రభుత్వ పారదర్శకత స్పష్టమవుతుందనే పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. హైస్కూళ్లలో 0-200 మందికి తొమ్మిది పోస్టులను, యూపీ స్కూల్స్‌లో 0-100కి నాలుగు ఇస్తున్నారు. విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే ప్రాథమిక విద్య ఎంతో పటిష్టంగా ఉండాలి. అలాంటి ప్రాథమిక విద్యారంగంలో మాత్రం అత్తెసరుగానే టీచర్స్‌ను నియమించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పొందకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హైస్కూళ్లలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ ఉండటం వల్ల పెద్దగా భారం ఉండదంటున్నారు. ఎలిమెంటరీ స్కూల్లో 60 మందికి ఇద్దరు టీచర్స్‌ను నియమిస్తే, వారిలో ఒకరు హెచ్ఎంగా అన్ని బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిగిలిన ఒక్క టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చేయాలంటున్నారు. ఏపీలో 92 వేల మంది ఎస్జీటీలు ఉన్నారని, 1ః30 నిష్పత్తిలో కేటాయించడం వల్ల ఎనిమిది వేల పోస్టులు మిగులుతాయని, వాటిని అవసరం ఉన్న స్కూళ్లలో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఎస్జీటీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తోందని సంఘాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని పోస్టులను బ్లాక్ చేయాలనే నిర్ణయాన్ని సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఇప్పటికే వందలాది మందికి దొడ్డిదారిన జీఓలు ఇచ్చిన ప్రభుత్వం, కేటగిరి -1, 2 (హెచ్ఆర్ఏ 14 శాతం, 20 శాతం) పోస్టులను తమకిష్టులకే ఇచ్చేందుకు బ్లాక్ చేస్తున్నారని, తాజా బదిలీలలో ఉన్న ఖాళీలన్నింటినీ చూపించాలని సంఘాలు డిమాండు చేస్తున్నాయి. 2019 నవంబరులో 12,800, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎనిమిది వేల పదోన్నతులతోపాటు 2018 డీఎస్పీ అభ్యర్థులకిచ్చిన స్థానాలను ఖాళీలలో చూపించాలంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
0 comments:
Post a comment