కరోనా లాక్డౌన్తో అంతర్జాతీయంగా ముడి చమురుధరలు అమాంతం పడిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో ధరలు గతంలో ఎప్పుడూ లేనంత భారీగా తగ్గాయి. ఐనప్పటికీ మనదేశంలో ప్రజలకు మాత్రం నేరుగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఊరట లభించింది. ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఉండే ప్రజలకు మే నుంచి సబ్సిడీ డబ్బులను కేంద్రం ఇవ్వడం లేదు. ఇతర నగరాల్లో కేవలం రూ.2 - 5 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు మాత్రం రూ.20 నామమాత్రపు సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ను మార్కెట్ ధరకే కొంటున్నారు వినియోగదారులు. కరోనా లాక్డౌన్ ప్రభావంతో మార్చి 2వ వారంలో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.
బ్యారెల్ ముడి చమురు ధర 35 డాలర్ల నుంచి 20 డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 25 డాలర్లుగా ఉంది. చమురు ధరల తగ్గడంతో దాని అనుబంధ ఉత్పత్తులైన ఎల్పీజీ ధరలు కూడా దిగొచ్చాయి. దాంతో ఆయిల్ కంపెనీ రాయితీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.162 మేర తగ్గించాయి.
మేలో దేశరాజధాని ఢిల్లీలో రాయితీయేతర సిలిండర్ ధర రూ.581గా ఉంది. సబ్సిడీ సిలిండర్ ధరలు కూడా ఇంచు మించుగా అంతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.గత ఆర్థిక సంవత్సనం ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.34,058 కోట్లును ఖర్చు చేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రూ.37,256.21 కోట్లను కేటాయించారు. ఐతే ఎల్పీజీ ధరలు తగ్గడం వలన సబ్సిడీ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో..
ఇందులో చాలా డబ్బులు మిగులుతాయని అంచనాలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సబ్సిడీని ఎత్తేసే అవకాశముందంటున్నారు మార్కెట్ నిపుణులు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సబ్సిడి బిల్లును రద్దు చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదనపు డబ్బును కోవిడ్ కట్టడి చర్యల కోసం వినియోగించుకోవచ్చని ఓ ప్రముఖ చమురు సంస్థకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు
but not reduced petroleum products ie petrol and diesel price
ReplyDelete