సెప్టెంబర్ 1నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభం
గురుకుల విద్యార్థులకు అందని పుస్తకాలు
టివిలు లేనివారికి చదువు ఎలా?
ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు బోధనపై స్పష్టత కరువు
విద్యాసంవత్సరం వృథా కాకుండా క్లాసులు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. 1వ తరగతి నుంచి పది వరకు డిజిటల్ క్లాసులు బోధించనున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలలేమి, స్థానిక పరిస్థితులు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. సర్కారు బడుల్లో చదువుతూ కనీసం టివి, ఆన్‌డ్రాయిడ్ సెల్‌ఫోన్ సౌకర్యాలు లేని విద్యార్థుల గురించి ఇసుమంతయినా పట్టించుకోలేదనే విమర్శ ఉంది. వీరికి పంచాయతీ కార్యాలయాల్లోనో, లైబ్రరీలలో క్లాసులు వినే ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సూచించింది. ఇది ప్రాక్టికల్‌గా విజయవంతం అవుతుందా అనేది సందేహమే. ఎందుకంటే చాలా పంచాయతీ కార్యాలయాల్లో టివి సౌకర్యం లేదు. ఉన్నా అవి మూలకుపడ్డవే ఎక్కువ. అరకొరగా కొన్నిప్రాంతాల్లో ఉన్నప్పటికీ కేబుల్ నెట్వర్క్ లేదు. పంచాయతీ కార్యాలయాల్లోకి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో చాలామంది వచ్చిపోతుంటారు. ఈ గోల మధ్య పిల్లలకు పాఠాలు ఏమేరకు ఎక్కుతాయనేది ప్రశ్నే. చాలా ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఇది కూడా ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. పిల్లలకు పాఠ్యపుస్తకాలు అత్యావశ్యకం. ఒక పాఠశాల పరిధిలోని పిల్లలకైతే దాదాపు చేర్చారు. కానీ, రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలు వేర్వేరు జిల్లాలకు చెందినవారు. వీరిలో మెజార్టీ పిల్లలకు నేటికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30 శాతం మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వీరి బోధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక విడుదల కాలేదు. మొన్నటివరకూ చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకున్నారు. ఆ తర్వాత పాఠశాలలను చాలాచోట్ల శుద్ధిచేసిన దాఖలాలు లేవు. పాఠశాలలను శుభ్రం చేసే స్వచ్ఛ కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. కరోనా నియంత్రణలో భాగంగా బ్లీచింగ్ చల్లటం, రసాయనాలు పిచికారీ చేయడమే గ్రామపంచాయతీ కార్మికులకు తలకుమించిన భారంగా ఉంది.
కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలను సెప్టెంబర్ 30 వరకు తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. అన్‌లాక్ 4 నిబంధనలలో కేవలం 50 శాతం ఉపాధ్యాయులనే పాఠశాలలకు రప్పించాలని చెప్పింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఉపాధ్యాయులందరూ క్షేత్రస్థాయిలో ఆన్లైన్ క్లాసులను పర్యవేక్షించాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే, రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువగా హైదరాబాద్ నుంచే రోజువారీగా పాఠశాలలకు వెళ్తుంటారు. ఆ తర్వాత ఎక్కువశాతం మంది జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలలో నివాసం ఉంటూ పనిచేసే పాఠశాలలకు ఇప్పటివరకు వెళ్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే. ఆర్టిసినే గ్రామాలకు తిప్పే బస్సుల సంఖ్యను తగ్గించింది. కరోనా నేపథ్యంలో ఆటోలు, ప్రయివేటు వాహనాలపైనా వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీచర్లు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పాఠశాలకు ఉపాధ్యాయులను తరలించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించలేదు. అన్‌లాక్ నిబంధనలకు విరుద్ధంగా టీచర్లందరూ విధిగా డ్యూటీకి హాజరు కావాలనే నిబంధనపైనా విమర్శలు వస్తున్నాయి.
0 comments:
Post a comment