రెండు అణాలకు టాంగా నడిపేవాడు….ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు.! ఒక హాస్పిటల్, 200 స్కూల్స్ ఫ్రీగా నడుపుతున్నాడు!
అనేక భారతీయ వంటకాల్లో మసాలాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే మసాలాల పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎండీహెచ్ మసాలా. టీవీల్లో యాడ్ వస్తుంది కదా.. అస్లీ మసాలా సచ్ సచ్.. ఎండీహెచ్.. ఎండీహెచ్.. అని.. అదే.. ఆ మసాలాకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ ప్యాకెట్లపై ఉండే తాత బొమ్మను చూసే చాలా మంది ఆ మసాలాలను కొంటారు. అంతటి పాపులారిటీ ఆ మసాలాకు ఉంది. అయితే ఆ కంపెనీని పెట్టింది ఎవరో తెలుసా..? మహాశయ్ చున్నీ లాల్ గులాటి. భారత్, పాక్ విడిపోకముందు అప్పటి సియాల్కోట్ ప్రాంతంలో ఎండీహెచ్ కంపెనీని పెట్టారు. దాన్నే మహాషియన్ డి హట్టి అని కూడా పిలుస్తారు. అయితే దాని కోసం గులాటి చాలా కష్టాలు పడ్డారు.
ఎండీహెచ్ ఒకప్పుడు చిన్న కంపెనీయే. కానీ ఇప్పుడు ఏటా కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఆ కంపెనీ మీట్ మసాలా, కసూరీ మేథీ, గరమ్ మసాలా, రాజ్మా మసాలా, షాహీ పనీర్ మసాలా, దాల్ మఖని మసాలా, సబ్జీ మసాలా తదితర 64 వెరైటీల మసాలాలను తయారు చేసి విక్రయిస్తోంది. 2017లో ఎండీహెచ్ ఏకంగా రూ.924 కోట్ల ఆదాయం పొందింది. 100కు పైగా దేశాలకు ఈ కంపెనీ తన మసాలాలను ఎగుమతి చేస్తుంది. సుమారుగా 8 లక్షల వరకు రిటెయిల్ డీలర్లు, 1000 మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు ఎండీహెచ్ కోసం పనిచేస్తున్నారు.
1923లో సియాల్కోట్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో మహాశయ్ చున్నీలాల్, మాతా చనన్ దేవిలకు ధర్మపాల్ గులాటి జన్మించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. తండ్రి మహాశయ్ తో కలిసి ఎక్కువగా పాలు, పాల ఉత్పత్తులు అమ్మేవారు. అందువల్ల చిన్నతనంలోనే ధర్మపాల్కి వ్యాపారం పట్ల అవగాహన కలిగిందని చెప్పవచ్చు. 5వ తరగతి అయ్యాక ధర్మపాల్ గులాటి చదువు పూర్తిగా మానేసి తండ్రి మహాశయ్తో కలిసి అద్దాలు, సబ్బులు అమ్మే వ్యాపారం చేసేవాడు. అలాగే హార్డ్‌వేర్, దుస్తులు, బియ్యం అమ్మేవారు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకులు ఇద్దరూ మహాషియన్ డి హట్టి (ఎండీహెచ్) మసాలా దుకాణం ఏర్పాటు చేశారు. దాన్నే దెగ్గి మిర్చ్ వాలె అని పిలిచేవారు. అయితే భారత్, పాక్ విభజన వల్ల ఆ వ్యాపారం, ఇల్లు, అన్నింటినీ వదులుకుని వారు రాత్రికి రాత్రి ఢిల్లీకి వచ్చారు.
ఢిల్లీకి చేరుకునేటప్పటికి ధర్మపాల్ వద్ద కేవలం రూ.1500 ఉన్నాయి. అందులో రూ.650 పెట్టి ఓ టాంగా కొన్నాడు. దాని సహాయంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కుతుబ్ రోడ్, కరోల్ బాగ్, బారా హిందు రావు ఏరియాకు 2 అణాలకు టాంగా నడిపేవాడు. అయితే తరువాత కొన్నేళ్లకు ఆ టాంగాను అమ్మి తన సోదరుడు సత్పాల్ తో కలిసి మళ్లీ అదే మసాలా వ్యాపారం ప్రారంభించాడు. 1953లో ఢిల్లీలో అలా తొలి ఎండీహెచ్ మసాలా స్టోర్ మొదలైంది. దీంతో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా వారి మసాలా వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. తరువాత వారు వెనుదిగిరి చూడలేదు.
ఇక ఎండీహెచ్ మసాలా యాడ్లలో కూడా ధర్మపాల్ కనిపించేవారు. నటీనటులు, సెలబ్రిటీలు అయితే కొంత కాలం పాటు యాడ్స్ చేస్తారు, పోతారు. కానీ తానే స్వయంగా యాడ్ చేస్తే.. ఆ మసాలాలు అమ్మేవారు ఎవరో జనాలకు తెలుస్తుందని, అలాగే ఒక బ్రాండ్‌గా ముద్ర పడుతుందని భావించిన ఆయన తానే స్వయంగా యాడ్స్‌లో నటించారు. దీంతో ఆ యాడ్స్ కూడా జనాలకు బాగా నచ్చాయి. ఈ క్రమంలో ఎండీహెచ్ మసాలా విక్రయాలు ఊపందుకున్నాయి. అలా నెమ్మదిగా అదొక బ్రాండ్‌గా స్థిరపడింది.
ఎండీహెచ్ మసాలా ప్యాకింగ్ కూడా అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. కాకపోతే కొంత అధునాతన లుక్ వచ్చింది అంతే. ఇక మసాలాల తయారీ కోసం వారు నాణ్యమైన పదార్థాలనే వాడుతారు. అందుకు గాను కేరళ, కర్ణాటక, ఆప్ఘనిస్తాన్, ఇరాన్‌ల నుంచి పదార్థాలను నాణ్యత కోసం తెప్పిస్తారు. ఇక ఎండీహెచ్‌కు దేశంలోని అనేక ప్రాంతాల్లో మసాలా తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వారు మసాలాల తయారీలో అత్యంత నాణ్యతను పాటిస్తారు. అలాగే మసాలాల రుచి, వాసన టెస్ట్ చేసేందుకు వారికి ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. అందుకనే ఎండీహెచ్ మసాలా అప్పటికీ, ఇప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటుంది. అది ఏమాత్రం మారలేదు. అందువల్లే ఆ మసాలాలకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది.
ఎన్నో కంపెనీలు ప్రస్తుతం మసాలాలను తయారు చేస్తున్నాయి. అయినప్పటికీ ఏ కంపెనీకి చెందిన మసాలాలు కూడా ఎండీహెచ్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి. అందుకు వారు మెయింటెయిన్ చేస్తున్న క్వాలిటీతోపాటు ఫ్లేవర్ కూడా ఓ కారణం. అలాగే యాడ్స్. అందువల్ల ఎండీహెచ్ ఒక చిన్న స్టోర్‌లో మొదలై నేడు మల్టీ నేషనల్ కంపెనీగా అవతరించింది. ఇక ఈ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే పశ్చిమ డిల్లీలో 300 పడకలతో ఓ హాస్పిటల్ నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే ఈ కంపెనీ 20 స్కూళ్లను నిర్వహిస్తోంది. వాటిల్లో పేద పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఇలా ఎండీహెచ్ ఓ వైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలనూ చేపడుతోంది.
0 comments:
Post a comment