Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 30 August 2020

ఉపాధ్యాయులు ,కవి, బాల సాహిత్యవేత్త మంచికంటి మాస్టారు గురించి...శాంతివనం ప్రస్థానం గురించి... ఆయన మాటల్లోనే..... స్పెషల్ స్టోరీ...


సాహిత్యం ప్రజలతోనే ఉంటుంది, ప్రజల దగ్గరే ఉంటుంది – మంచికంటి
మంచికంటి  గారితో గోదావరి
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మంచికంటి (మంచికంటి వెంకటేశ్వర రెడ్డి ఫోన్ : +91 99495 35695)
 ఇచ్చిన ఇంటర్వ్యూ

మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.
పుట్టుకతో అందరు మనషులూ ఒకేలా పుట్టినా, పెరిగే క్రమంలో   అనేక ప్రభావాలకు లోనవుతూ ఉంటారు. అలాగే సాహిత్య అధ్యయనానికి పూర్వం అధ్యయనం తర్వాత  మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది .అధ్యయనం నుండి ఆచరణకు పూనుకున్న తర్వాత ఆ మార్పు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఒక క్రమ పరిణామం నాలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర చిన్న పల్లెటూరు కలికివాయ గ్రామం. మా నాన్న నిశానీ రైతుకూలీ .మా అమ్మ అక్షరాలు కూడబలుక్కుని చదువుతూ ఉండేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా గ్రామంలో మనుషుల్ని గమనిస్తూఉండేవాడిని.పని చేయడానికే వీళ్లు పుట్టారా అన్నట్టు ఉండేవాళ్ళు. నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు ఎవరూ లేకపోవడంతో చాలా ఒంటరిగా పెరిగాను. ఒంటరితనం పుస్తకాలకు బాగా దగ్గర చేసింది. ఆ పుస్తకాలే మా గ్రామానికి ఏమైనా చేయాలి అనే బలీయమైన కోరికను పెంచాయి. అప్పుడు గ్రామంలో ఒక వాతావరణం ఉండేది. యువజన సంఘం గ్రంథాలయం, ఆట పాటలు సాంఘిక, పౌరాణిక, సాంస్కృతిక నాటకాలు ఇవన్నీ మనిషి ఎదుగుదలకు అవసరమైన మేలైన వాతావరణం. ఆ వాతావరణం నుండి మానసికంగా ఎదుగుదల అనేది మొదలైంది. స్కూలు, కాలేజీ ప్రతి మజిలీ లోనూ పెద్దపెద్ద గ్రంథాలయాలు చూస్తూ పెరిగాను. విద్యాలయాల చదువుకంటే గ్రంధాలయాల చదువే మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతుంది.
మా ఊరు కలికివాయ నుండి సింగరాయకొండ, టంగుటూరు, ఏలూరుల మీదుగా బాల్యం నుండి కౌమార యవ్వన దశలన్నీ విద్యాభ్యాసంతో సాగిపోయాయి .అప్పటికి జీవితాన్ని గురించి గానీ జీవన సారాన్ని గురించి గానీ ఏమీ తెలియలేదు. కొత్తపట్నం లో ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పటి నుండి  సాహితీ జీవితం కొద్దిగా మొదలైంది. ఒంగోలు వచ్చిన తర్వాత పూర్తి సాహిత్యంలోనే మునిగిపోయాను.

మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

అక్షర సాహితీసమితి ఎంవిఎస్ శాస్త్రి ,ప్రకాశం జిల్లా రచయితల సంఘం బి.హనుమారెడ్డి, నాగభైరవ కోటేశ్వరరావు, ప్రకృతి సాహితి శ్రీరామకవచం సాగర్, మూర్తి ,కాట్రగడ్డ దయానంద్ వీళ్ళ సాహచర్యంతో ఒక్కొక్క మజిలీ దాటుకుంటూ సాహిత్యాన్ని చదవడం ఎలానో తెలుసుకున్నాను. తెలుసుకునే క్రమంలోనే కథ, కవిత్వం  రూపుదిద్దుకున్నాయి.
తరచుగా ఒంగోలు వచ్చే కె. శివారెడ్డి , డాక్టర్ వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్ ఎక్కువగా నన్ను ప్రోత్సహించిన వారు, ప్రభావితం చేసిన వారు కూడా. ఒక దశలో విరసంలో సభ్యునిగా చేరడానికి కూడా ప్రయత్నించాను.

మీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
ప్రతి కవి మహాప్రస్థానంతో మొదలైనట్టుగానే నేను కూడా అక్కడి నుండే మొదలయ్యాను.
గోపీచంద్, బుచ్చిబాబు, చలంలను చదువుతూ రష్యన్ సాహిత్యం వైపు వెళ్లాను. చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది రష్యన్ సాహిత్యం.
మనిషి ఉనికి  సమాజంలోనే. అలాంటి సమాజాన్ని పరిశీలిస్తున్న క్రమంలో మనిషి అనేక మార్పులకు లోనవుతాడు.అలా సమాజంలో అసమానతలు, పీడన, దోపిడీ చూస్తూ పెరిగే క్రమంలో సామాజిక స్పృహ, ప్రజానుకూల దృక్పథం ఏర్పడుతూ వచ్చాయి.
ఒంగోలు సాహిత్య వాతావరణం అంతా కవిత్వం, నాటకం, పద్యం, అష్టావధానం, సినిమా చుట్టూ తిరుగుతూ ఉండేవి. నా జీవన నేపథ్యం కథ చుట్టూ తిరిగే వాతావరణం. వాస్తవానికి నా సాహితీ జీవితం కథలతో మొదలైంది కానీ సరైన దిశానిర్దేశం, వాతావరణం లేక కవిత్వంలోకి ప్రయాణించింది. కాట్రగడ్డ దయానంద్, మూర్తి, సాగర్ల సాహచర్యంతో మళ్లీ కథలోకి రాగలిగాను. కథలు రాయడానికి ప్రోత్సాహం కావాలి కదా ! అది కథల పోటీ ద్వారా పొందాను. అంతకు ముందు చిన్న చిన్న పత్రికలలో  కవితలు, కథలు వచ్చినా  తానా కథల పోటీలో  కథ గెలుపొందిన తర్వాత  మిత్తవ కథ నా స్థానాన్ని  సాహిత్య లోకంలో సుస్థిరం చేసింది. అలాగా కవిత్వం నుండి కథలు ,నవల ఇలా సాగింది నా సాహితీ ప్రయాణం.   ప్రతి రచయిత తనలో జరిగే సంఘర్షణను బయటకు చెప్పడానికి రచనను ఎంచుకుంటాడు. అలా మొదలైన నా రచన పోటీలు ప్రభావంతో మరింత ముందుకు సాగింది.
ఇలా రచయితగా మారే క్రమంలో చాలా ఘర్షణ చోటు చేసుకుంటూ వచ్చింది. నాలాగా ఎందరో ఘర్షణ పడుతూ ఉంటారు కదా! వాళ్ల కోసం పని చేద్దామని నిత్యం సభలు-సమావేశాలు వర్క్ షాపులు ఏర్పాటు చేస్తూ వచ్చానువారధి ఆగిపోయిందేమి?
 ఇన్ని చేసినా ఏదో వెలితి కనిపిస్తుంది .సమాజం కోసమే రచనలు చేస్తుంది .మరి ఆ రచనలు చదివే పాఠకులు లేకుంటే మన రచనలు ఎవరి కోసం చేస్తున్నాం అనే ప్రశ్న వెంటాడేది .
ఆ సమయంలో తిరుపతి సభలో చాలా మంది మిత్రులం కలిశాము .
అక్కడే వారధి పురుడుపోసుకుంది. సుంకోజి దేవేంద్రాచారి ,పలమనేరు బాలాజీ ,జి వెంకట కృష్ణ, కే.ఎన్ మల్లేశ్వరి, పెద్దింటి అశోక్ కుమార్, నేను కలిసి   సహకార పద్ధతిలో 26 మంది కథా రచయితల కథలతో నవతరం తెలుగు కథ ప్రచురించాము. ఇలా మొదలైన వారధి కథలతో పాఠకులను కలిసి  పుస్తకాలు విక్రయించాలనేది నియమం. అలా సాగిన ప్రయాణం సమిష్టిగా అక్కడితోనే ఆగినా ఒంగోలులో సాహితీమిత్రులు డాక్టర్ సుధాకర్ ను పరిచయం చేసింది. ఆ పరిచయమే శాంతివనం రూపుదిద్దుకోవడానికి బలాన్నిచ్చింది. సామూహికంగా మొదలైన వారధి ఆగిపోయింది కానీ, నావరకు నాకు శాంతివనం వారధి కొనసాగింపుగానే భావిస్తాను. ఎంతో మంది పిల్లల్ని పాఠకులుగా తయారు చేశాము. చాలా మంది పిల్లలు కవితలు కథలు రాస్తున్నారు. శాంతివనం ద్వారా ఎంతో సాహిత్య వాతావరణం ఏర్పాటు చేశాము. అలాగే వారధి ముఖ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక ఉద్యమంగా కొనసాగడం చూస్తూ ఉన్నాము. డాక్టర్ సుధాకర్ గారు కథలు బాగా చదువుతారు రచయితలతో మాట్లాడతారు ఇప్పుడు మంచి కథలను ఎంపిక చేసుకుని రికార్డు చేసి స్పోటిఫై యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.
అప్పటిదాకా సాహిత్యమంటే చదవడం తిరిగి రచనలు చేయడం దగ్గరేఉండే నేను తెలుసుకున్నది ఏమంటే ఈ రెండింటి కంటే ఆచరణ ముఖ్యమనేది. అంతేకాకుండా పాఠకులు ,రచయితలు పిల్లల నుండి రావాల్సి ఉంటుందని కూడా అర్థమైంది.

శాంతివనం గురించి చెప్పండి?
అప్పటినుండి సాహిత్య లోకాన్ని వదిలి పిల్లల లోకంలోకి వచ్చేశాను. వాస్తవ లోకంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయ లోకం అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా ఉండటం తట్టుకోలేక పోయాను. సాహిత్య లోకమనే తెరను తొలగించుకొని వాస్తవ జీవితం లోకి వచ్చిన నా ఉపాధ్యాయ వృత్తి కి  పిల్లలే మెరుగులు దిద్దారు.
వృత్తి పరంగా కూడా చైతన్యవంతమైన తర్వాత చూస్తూ కూర్చోవడం, విమర్శిస్తూ ఉండటం కంటే మన వంతుగా ఏమి చేయొచ్చు అని ఆలోచించి పూర్తిగా సమాజంతో మమేకం అయ్యాను. నా కృషికి తోడు డాక్టర్ సుధాకర్ గారు మరియు అనేకమంది మిత్రులు సహకారంతో శాంతివనాన్ని పి.నాయుడు పాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది
మనిషి జీవితానికి ప్రారంభం బాల్యం. సమాజానికి పునాది గ్రామం. నిజమైన జీవితం గ్రామాల్లోనే ఉంటుంది. అలాంటి గ్రామాన్ని ఏ దశలోనూ నేను వదిలిపెట్టలేదు. గత పది సంవత్సరాలుగా పూర్తిగా గ్రామ జీవితంలోనే ఉండిపోయాను. కాబట్టే కార్యాచరణ సాధ్యమైంది.
నీ కసలే లక్ష్యంలేదు అని అనేక సందర్భాల్లో పెద్దల నోటి వెంట వింటూ ఉంటాం. అలాంటి లక్ష్యం ఏర్పడింది పిల్లల మధ్యకు వచ్చిన తర్వాతే .సాహిత్యం జీవితాన్ని ఆనందమయం చేస్తే , పిల్లలతో సహజీవనం లక్ష్యాన్ని ఏర్పరచింది. బాల్యంలో ఎవరైనా సహాయం చేస్తే బాగా చదువుకోవచ్చు అని ఒక అభిప్రాయం నాలో ఉండేది. అభిప్రాయం  నాతో పాటుగా అంతర్గతంగా ఉండి, వాతావరణం ఏర్పడిన తర్వాత, జీవితానికి లక్ష్యం ఏర్పడిన తర్వాత అది బహిర్గతమై శాంతివనం రూపంలోకి మారింది .
ఈ లక్ష్యాన్ని బలపరిచే అనేకమంది సాధించిన విజయాలు వాస్తవిక విజయగాథలు, వివేకానందుని యువతా మేలుకో ఇవన్నీ చాలా ప్రభావితం చేశాయి .


గొప్ప రచయితల రచనలను పిల్లలకు పాఠాలుగా చెప్పేటప్పుడు నాకు నేనుగా ముందు ప్రభావితుడను అయ్యేవాడిని. ఆ తరువాతే పిల్లలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వాడిని.
మీ పుస్తకాల  శీర్షికలు విభిన్నంగా స్థానిక పేర్లతో ఉంటాయి.  అందుకు కారణం ఏమిటి?
నా కవిత్వం విషయానికొస్తే ప్రాథమికంగా రాసిన కవిత్వం లో అంత బలమైన అభివ్యక్తి లేదు. నా చుట్టూ ఏర్పడిన గందరగోళం కనిపిస్తుంది .కానీ పరిపక్వత వచ్చిన తర్వాత  కవిత్వంలో బలమైన అభివ్యక్తి తాత్వికత ఉంది. కథల విషయానికొస్తే నా కథల్లో  శైలి పల్లెటూరి జీవితం. శిల్పానికొస్తే భాషే శిల్పంగా భావిస్తాను. తర్వాత వచ్చే కథల్లో మార్పు కనిపించవచ్చు.
అందుకే కథల పేర్లు, కథాసంకలనాల పేర్లు, నవలల పేర్లు కూడా మాండలికం లోనే ఉంటాయి. నేను రాసింది గొప్ప సాహిత్యం అని ఎప్పుడూ భావించలేదు నన్ను నేను నిరంతరం పరిశీలించు కొంటూనే, మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను .మన ముందు తరాల గొప్ప రచయితల సంకల్పం ముందు మనం సృష్టించే సాహిత్యం ఏపాటిది.వాళ్ళ సాధన, ఆచరణ, మమేకత నుండి మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.
నా రచనల్ని నా చుట్టూ ఉన్న జీవితాల్ని రికార్డు చేయడం గానే భావిస్తాను.


మీరు  సైకిల్ యాత్ర  చేయాలని  ఎందుకు అనుకున్నారు? ఆ అనుభవాలు రికార్డు చేసారు కదా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది?
లక్ష్య సాధన గురించి పిల్లలకు బోధించేటప్పుడు నాకు నేనుగా ఏమి సాధించాను అని ప్రశ్నించుకునేవాడిని. హిమాలయాల్లో, థార్ ఎడారిలో, అరకులోయలో ఇలా  ప్రకృతితో మమేకమయ్యే ఎన్నో ట్రెక్కింగ్స్ చేశాను. ఈ క్రమంలో మార్టూరు వసంత్ చెన్నై నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేస్తూ ఒంగోలు వచ్చారు. అతన్ని కలిసిన స్ఫూర్తి నా సైకిల్ యాత్రకు ప్రేరణ.
ఎక్కడెక్కడో వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రదేశాలు సందర్శించి వచ్చాను. మరి మన జిల్లా ఒకసారి చుట్టి వస్తే అనే ఆలోచన వచ్చింది. అదీగాక అప్పుడు బాలల హక్కుల మీద కూడా పనిచేస్తున్నాను. కాబట్టి బాలల హక్కులను ప్రచారం చేస్తూ ఈ యాత్ర సాగించాను. సమూహంతో జిల్లా అంతటా చేయాలనుకున్న యాత్ర ఒంటరిగా సగమే చేయగలిగాను. ఆ యాత్ర స్ఫూర్తి ఇప్పుడు రాష్ట్రమంతా గ్రంథాలయ ఉద్యమ యాత్ర కు నన్ను సన్నద్ధం చేస్తుంది.
కథకుడిగా కవిగా నవలాకారుడిగా ఉన్న మీరు  బాలసాహిత్యం వైపుకు ఎందుకు వెళ్ళారు?
పెద్దలు అందరమూ ఎన్నో విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. కానీ పిల్లల ఆలోచనలకు, అభిప్రాయాలకు, కోరికలకు, కలలకు ప్రాధాన్యత ఇవ్వం.  మొక్కై వంగనిది మానై వంగదు  అనేది సామెత కదా.   పిల్లలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళలోని శక్తిని గుర్తించి, వారిని ప్రోత్సహిస్తే ఆకాశపు అంచులను చూస్తారు. ఈ తాత్వికతో నడుస్తున్నది శాంతివనం
ముక్కు మొఖము తెలియని ఒక గ్రామంలో విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా కేంద్రం ఉంటే పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దవచ్చో శాంతివనం ద్వారా నిరూపిస్తూ వస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది బాల కవులున్నారు  పుస్తకాలను ఆబగా చదివే పిల్లలు ఉన్నారు. శాంతివనమే పెద్ద గ్రంథాలయం. పిల్లలకు కింద స్థాయి నుండి పుస్తకపఠనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో నేర్పించడం ఇక్కడ నిరంతర ప్రక్రియ. శాంతివనం నుండి కొంతమంది విద్యార్థులు విజయాన్ని సాధించి జీవితంలో స్థిరపడుతున్నారు.
పాఠశాల దశ నుండే పిల్లల్ని మూర్ఖులుగా, ఆలోచన లేని వారిగా, దుర్మార్గులుగా, మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లుగా పిల్లల్ని విడదీసి ఆలోచన లేని యంత్రాలుగా తయారుచేస్తున్న దుర్మార్గ వాతావరణంలో ఉన్నాము. ఈ వాతావరణం నుండి పిల్లల్ని ఆలోచనాపరులుగా, జ్ఞాన సంపన్నులుగా లక్ష్య సాధకులుగా మార్చాలన్న ప్రయత్నం పది సంవత్సరాలుగా జరుగుతుంది.
ఈ క్రమంలో ఈ సంవత్సరం గ్రంథాలయ ఉద్యమాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహణ సన్నాహాల్లో ఉన్నాను.  ప్రముఖ సాహిత్యకారులు వాడ్రేవు చినవీరభద్రుడు గారు కమిషనర్ గా రావడం, బాల సాహిత్యం వైపు ఆలోచన చేయడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ఆయన భుజాలకు ఎత్తుకోవడం జరిగింది.
అనేక మంది ఉపాధ్యాయులు రచయితలు పిల్లల కోసం వివిధ రకాల ప్రయోగాలు ప్రయత్నాలు  చేస్తున్నారు. వీళ్లందరినీ ఒక తాటి మీదకు తెచ్చి పిల్లలకు ఉపయోగపడే పుస్తక రచన చేయించడం, పాఠశాల గ్రంథాలయాలను బలోపేతం చేయడం ,పిల్లలను పాఠకులుగా, రచయితులగా మార్చడం అనే ఆలోచన కార్యక్రమంతో చేస్తున్నదే బాల సాహిత్య కార్యక్రమం. నా సాహిత్య ప్రయాణంలో ఇదొక గొప్ప మజిలీ .
సమాజంలో మార్పు కొరకు సాహిత్యం ఎంత మేరకు పనికి వస్తుంది?
జీవితం వేరు. సాహిత్యం వేరు. ఆచరణ వేరు. ఆలోచన వేరు అయినప్పుడు ఏదీ సాధించడం సాధ్యం కాదు .అన్నీ ఒకటే అయినప్పుడు అది ఒక సాధన అవుతుంది. అన్నింటినీ ఒకటిగా చేసుకోడానికి చాలా సాధన కావాలి. గుండె నిబ్బరం కావాలి. ధైర్యం కావాలి. దీనిని సాధించడానికి చాలా సమయమే పట్టింది .ఒక్కొక్కసారి వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. ఒకటే జీవితం కదా! అనుకున్నవన్నీ ఇప్పుడే చేసుకుంటూ పోవాలి. ఇలా ప్రయాణించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. పట్టించుకోకూడదు. ముళ్ళు రాళ్లు ఏరివేసి కొత్త బాటలు ఏర్పరిచేటప్పుడు కొన్ని గాయాలవుతాయి. కొన్ని ఎదురుదెబ్బలు  తగులుతాయి. లెక్క పెట్టకూడదు .లక్ష్యం నీదైనది అయినప్పుడు ప్రతి దానికి నువ్వే బాధ్యుడవు అంటాడు వివేకానందుడు. అందుకే ఎన్ని పనులైనా ఒకేసారి చేయడం సాధ్యమే. వృధా చేసే సమయం తక్కువ అయినప్పుడు ఎన్ని పనులైనా చేయవచ్చు. ఒంటరిగా చేయలేని పనులు సమూహంతో చేయవచ్చు.
 కాబట్టి నా సంకల్పం కృషి పట్టుదల అన్నీ సాహిత్యం నుండి వచ్చినవే .నా వంతుగా నేను పిసరంతయినా మార్పు తీసుకు రాగలిగాను అంటే అది సాహిత్యం వల్లనే .సాహిత్యం మనిషిలోకి ఇంకిపోతే ఎంతో మార్పు కు ప్రేరణ అవుతుంది. ఇది మనిషిలోని రాక్షసత్వాన్ని రూపుమాపడానికి ,సాధుతత్వాన్ని పెంపొందించడానికి సాహిత్యం ఖచ్చితంగా దోహదపడుతుంది .ఆ దిశగా ఆలోచించినా మనిషిలో మార్పుకు సాహిత్యమే కారణం కదా!మనిషే సమాజానికి మూల బిందువు కదా!సమాజంలో మార్పు కొరకు సాహిత్యం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అది నేటి తరాన్ని సాహిత్యంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే.

ప్రకాశం జిల్లా సాహిత్య  వాతావరణం  ఎలా ఉంది?
 ప్రకాశం జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు. ఎప్పుడూ ఏదో రూపంలో చరిత్ర సృష్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సాహిత్య వాతావరణం సుసంపన్నంగా ఉంది  జానుడి, శాంతివనం ,కథాప్రకాశం సంయుక్తంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అనేక సంస్థలు రకరకాల కార్యక్రమాలు నిరంతరంగా జరుపుతూ ఉంటాయి. కొత్తగా వచ్చే తరం కోసం మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాము.
ప్రస్తుతం వెలువడుతున్న సాహిత్యం ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నదా?
సాహిత్యం ప్రజలకు దూరంగా జరిగిపోయింది. ప్రజలకే కాదు  రచయితలకు కూడా దూరమైపోయింది.  రచయితలు ప్రజలతో ప్రజా సమస్యలతో, ఉద్యమాలతో మమేకం అయినప్పుడు సమాజంతో సాన్నిహిత్యం కలిగి ఉన్నప్పుడు సాహిత్యం ప్రజలతోనే ఉంటుంది. ప్రజల దగ్గరే ఉంటుంది.
సామాజిక మాధ్యమాలు ప్రబలి పోయినప్పుడు వ్యక్తిగత జీవితమే సాహిత్యం అవుతుంది. అదే సర్వస్వం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే . మనకు తెలియకుండానే దానిలోకి కూరుకు పోయాము. అధ్యయనం, ఆచరణ ,రచన ఇది వరుసక్రమం .రచన ప్రచురణ ఇదే ప్రధానాంశం ఇప్పుడు. సోషల్ మీడియా అందుబాటులో  ఉండడం వల్ల ఇలా రాయడం, అలా ప్రచురించుకోవడం,  లైకులు కొరకు ఎదురు చూడటం.  ఇది దుష్పరిణామం. వాస్తవం తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి .ఆచరణ ద్వారా  అనుభవించాలి. పరిశీలన ఉండాలి .ఆ తర్వాతే రచన. అప్పుడు అది ప్రామాణికంగా, అనుభూతి చెందేదిగా వుంటుంది.
మనకు తెలియకుండానే పెట్టుబడిదారీ సంస్కృతి, వస్తు వినిమయ సంస్కృతిని దాటి మాయాజాల సంస్కృతిలోకి జారిపోయిన విషాదకర సందర్భమిది.
ఇవాల్టి రచయితల సాహిత్యం ఎలా ఉంటున్నది?
రాసే ప్రతి వాక్యము కవిత్వమనే అనుకుంటున్నారు. తాదాత్మ్యత లోపించింది. అనుభవైకవేద్యం లేదు. సాధన లేదు. అధ్యయనం ముగిసిపోయింది. నవలల విషయానికొస్తే కేవలం పోటీలకు పరిమితమైపోయాయి. అంటే అన్ని పేజీలు పుస్తకాలు చదివే సమయం లేదు. ఓపికా ఉండటం లేదు.
 కథ అంటే జీవితం కదా !సంఘర్షణకు లోనవుతున్న ఇప్పటి యువతరం జీవితం నుండి కథ సుసంపన్నం అవుతుంది. యువత చేతిలో కథ విరాజిల్లుతూ ఉంది.
సాహిత్యం జీవితంలో మిమ్ములను కదిలించిన అనుభవం చెప్పండి.
 జీవితంలో సాహిత్యకారులుగా ఉంటూ ఎన్నో దుర్మార్గాలు చేసిన వాళ్లని చూశాను. దుర్మార్గంగా ఎందరినో ఉపయోగించుకుని ఎదిగిన వాళ్లను చూశాను. సాహిత్యకారులుగా ఉంటూనే సమాజానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్ళని చూశాను. సాహిత్యం కోసమే జీవితాలను పణంగా పెట్టిన వాళ్లను చూసాను
రచయితలు ప్రజలకు చేరువ కావాలంటే ఏం  చేయాలి? 
రచయితలు ప్రజలకు చేరువ కావాలంటే మనం చెప్పేది వాళ్లకి చేరాలి. వాళ్లకి చేరింది వాళ్లు నమ్మాలంటే వాళ్ల సాధకబాధలలో మనము భాగస్వాములం కావాలి. వాళ్ళను గురించి రాసిన రచన వాళ్లే చదువుకోగలిగే శక్తి సామర్ధ్యాలు వాళ్లకి ఇవ్వాలి. అంటే మనం వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తూనే ఉండాలి. కార్యాచరణ అంతా వాళ్ళ మధ్యనే జరుగుతూ ఉండాలి. యువతరాన్ని కదిలించే కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి.
ఇప్పటి రచయితలకు మీరిచ్చే సూచన ఏమిటి?
 రాయడానికి ప్రాధాన్యం ఇవ్వడం కంటే అధ్యయనానికి ప్రాధాన్యతనివ్వాలి. సాహిత్యంలో కూరుకుపోవడం కంటే మన కళ్ళ ముందే  కాలిపోతున్న బతుకుల్ని నిలబెట్టడానికి ప్రాధాన్యతనివ్వాలి. సాహిత్యం అంటే కేవలం ప్రవచనాలు కాదు కదా !చెప్పే వాళ్ళు చేయడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి .ఎక్కడో ఉండి లైకులు కొట్టే సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత నివ్వడం అవివేకమే అవుతుంది. కళ్లకు కనిపించే  ఆ  మాయంతా నిజం కాదుకదా!ఎవరో ఎవరి కోసమో సృష్టించిన మాయలో మైమరిచి పడిపోవడం ఇప్పటి తరం దురదృష్టం.
సమాజం పట్ల రచయితల బాధ్యత ఎలా ఉండాలంటారు?
ఇవాల్టి విద్యావ్యవస్థ పిల్లల్ని అంధకారంలోకి తీసుకెళ్లి వదిలేసే విధంగా ఉంది. సాహిత్యం ద్వారా, పుస్తక పఠనం ద్వారా పిల్లల్ని ఆలోచనలోకి తీసుకెళ్లాలనేదే సంకల్పం. దానికోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను.
బాలసాహిత్యంలోకి వచ్చాను కాబట్టి పిల్లల కోసం కథలు కూడా రాస్తున్నాను. అలాగని మిగిలిన సాహిత్యాన్ని వదిలిపెట్టింది లేదు కథలు రాస్తున్నాను. ఒక నవల రాసే ప్రయత్నంలో ఉన్నాను .

ఇవాళ ఎవరైనా చేయాల్సింది ఒక్కటే పని. చదువు పేరుతో పిల్లల్ని నిరక్షరాస్యులుగా తయారు చేస్తున్నాము. ఈ తరం కోసం అందరం సమిష్టిగా కృషి చేసి వాళ్లను ఆలోచనా విధానం లో కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రచయితలుగా మన పైన ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది.

చివరిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
సుదూర లక్ష్యాలుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టే ఆలోచనతో ఉన్నాము. చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేస్తూ పోతూ ఉండడమే జీవితం డబ్బు చాలా మంది దగ్గర  ఉంటుంది. అది పదిమందికి ఉపయోగపడే టట్టు చేయాలి నా దృష్టిలో అయితే చాలామంది పిల్లలు కోసం, చదువుల కోసం ఖర్చు చేస్తే ఆ డబ్బుకు ఎంతో విలువ వస్తుంది. ఈ అంశాన్ని  కూడా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఆ వైపుగానే ప్రయత్నాలు చేస్తున్నాము.  అలాగే  పిల్లలు నిరంతరం  ప్రయోగాలు చేసుకుంటూ నేర్చుకుంటూ ఎదగడానికి  ఒక విశాలమైన వేదికను కల కంటూ ముందుకు సాగుతుంటాము. మొత్తంగా దాశరధి అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగం కోసం, శ్రీ శ్రీ పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల కోసమే కాలాన్ని కరగ దీస్తూ కరిగి పోవాలన్నది నా ముందున్న లక్ష్యం.

సంగీతం గురించి
 నాకు నేనుగా ప్రశాంతంగా ఉండటానికి కారణం సంగీతం వినడమే .హిందుస్తానీ కర్ణాటక శాస్త్రీయ సంగీత మంచి సినిమా సంగీతం వినడం వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఆ ప్రశాంతత నుంచి మనం ఏదైనా సాధించవచ్చు.

మంచి జీవన విధానం 
మనం తీసుకునే ఆహారం ఇవాళ ఎంతో కలుషితమై పోయింది .ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి .అంటే మనం తీసుకునే ఆహారంలోనే వ్యాధులు సంక్రమించే గుణాలున్నాయి. ఇది అందరం స్పృహలో ఉంచుకోవలసిన విషయం. అలాగే పర్యావరణ స్పృహ కూడా సాహిత్యకారులకుండాల్సిన మరో ప్రధాన లక్షణం. ఎందుకంటే అందరి కంటే మనం గొప్పగా ఆలోచిస్తాం కదా!..

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top