11వ పీఆర్ సీ మరికొంత ఆలస్యమే!
మరోసారి గడువు పెంపు తప్పదా?
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల వేతన సవరణ మరికొంత ఆలస్యమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ వేతన సవరణ సంఘానికి జూన్ 30తో గడువు పూర్తయింది. దాదాపు ఇప్పటికే వీరు తమ పని పూర్తి చేశారు. నివేదికను కొలిక్కి తీసుకువచ్చారు. కొన్ని కీలకాంశాల్లో చిన్న చిన స్పష్టతలు ప్రభుత్వం పొందవలసి ఉంది. ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలతో మాట్లాడి నివేదికకు తుది రూపు ఇవ్వాలనే యోచనలో కమిటీలో కొందరు ఉన్నారు. నివేదిక దాదాపు కొలిక్కి వచ్చిందన్న వర్తమానమూ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలకు తెలియజేశారు. జూన్ 30 కన్నా చాలా ముందే దాదాపు నివేదికను కొలిక్కి తీసుకువచ్చారు. ప్రభుత్వ మార్గదర్శనం కోసం ఎదురుచూశారు. ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంటు తీసుకుని ఒకటి రెండు అంశాలు చర్చించి నివేదిక సమర్పించాలని కమిటీ భావించినట్లు తెలిసింది. ఈ లోపు కరోనాతో కార్యకలాపాలన్నీ ఆగాయి. పైగా వ్యవస్థాగతంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం తాజా మార్పులు కోరితే నివేదికకు మరింత కాలం పట్టే అవకాశం ఉంది.
2018 లో ప్రభుత్వం ఈ సంఘాన్ని నియమించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ సంఘం కాలపరిమితి కూడా పొడిగించారు. మరో వైపు వీరి నివేదిక ఎప్పుడు ప్రభుత్వానికి అందుతుందా అని ఉద్యోగులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. జూన్ 30కి వీరి గడువు ముగిసింది. ఇప్పటికే రెండు నెలలయినందున సాంకేతికంగాను మరోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
*కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు*
కరోనా వల్ల రాష్ర్ట ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమయ్యాయి. ఆదాయాలు తగ్గాయి. రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉంది. ఇప్పటికే కరోనా వల్ల పెండింగులో ఉన్న జీతాలు, పెన్షన్లు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగోనందున మెరుగుపడ్డాక ఇస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రెండు నెలల్లో 12శాతం వడ్డీతో సహా చెల్లించాలని రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం చెప్పింది.
పెండింగు జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు పడాలనే అభిప్రాయం సర్కార్ వ్యక్తీకరించిన పరిస్థితుల్లో పీఆర్సీ నివేదిక తీసుకుని తక్షణమే అమలు చేయడమూ అంత సులభమయ్యే విషయం కాదని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరో వైపు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఈ ఏడాది ఇది కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. అన్నింటి కన్నా ముఖ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత బడ్జెట్ లో పీఆర్సీ కేటాయింపులపై దృష్టి పెట్టని విషయాన్ని ఒక ఆర్థికశాఖ అధికారి ప్రస్తావించారు.
0 comments:
Post a comment