విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటిని ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) పద్ధతిలోకానీ, ఆన్‌లైన్+ఆఫ్‌లైన్ కలగలిసిన మిశ్రమ విధానంలోకానీ నిర్వహించవచ్చని తెలిపారు. కొవిడ్-19ను పురస్కరించుకొని ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ విద్యార్థులు హాజరుకాలేకపోతే సమయం అనుకూలించినప్పుడు వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షలు రాయలేని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంకానీ, ఇబ్బందులుకానీ కల్పించరాదని సూచించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సూచనల మేరకు పరీక్షల నిర్వహణకు అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) ఈ నెల 8న జారీ చేసినట్లు గుర్తుచేశారు. పరీక్షల నిర్వహణపై దేశంలోని 945 విశ్వవిద్యాలయాల అభిప్రాయం కోరగా ఇప్పటివరకు 755 స్పందించాయని పేర్కొన్నారు. ఇప్పటికే 194 విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలు పూర్తిచేసినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన యువసేన
ముంబయి: కరోనా దృష్ట్యా చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ శివసేన అనుబంధ విభాగమైన యువసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశామని యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయి తెలిపారు.
0 Comments:
Post a Comment