అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆతురతగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ నిర్ణయం ఇప్పట్లో వెలువడే అవకాశం లేదు. ఆ బిల్లుపై గవర్నర్ నిర్ణయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కొంత కాలం నిరీక్షించక తప్పదు. మూడు రాజధానుల బిల్లుగా చెబుతున్న పాలనా వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఎ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన పంపించింది. అయితే, ఆ బిల్లులను ఆమోదించవద్దని ప్రతిపక్ష నేతలు గవర్నర్ ను కోరుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అమరావతి రైతులకు ఇచ్చిన హామీకి విరుద్దమని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది.
అంతేకాకుండా, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టానికి విరుద్ధమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వాదిస్తున్నారు. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం పరిధిలోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని ఆయన చెప్పారు. మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని ఆయన అంటున్నారు.
విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో అసెంబ్లీ క్యాపిటల్ ను, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు బిల్లును శాసనసభలో ఆమోదించి శాసన మండలికి పంపించింది. శాసన మండలిలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. రెండో సారి శాసన మండలికి పంపినప్పుడు బిల్లుపై చర్చ జరగలేదు.
బిల్లును శాసనసభకు పంపిన గడువు ముగిసినందున అది ఆమోదం పొందినట్లేనని ప్రభుత్వం వాదిస్తోంది. గడువు ముగిసింది కాబట్టి ఆమోదం కోసం గవర్నర్ కు పంపినట్లు చెబుతోంది. మొత్తం మీద మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం ఎప్పుడు అమలులోకి వస్తుందో చెప్పడం కష్టంగానే ఉంది.
0 Comments:
Post a Comment