ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల వ్యవహారం ‘రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ)’కి పెద్ద సవాల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దుచేసిన ప్రభుత్వం విద్యార్థులందరూ పాసైనట్లు ప్రకటించడంతో పాటు వారికి గ్రేడ్లు/మార్కులు ఇవ్వడం లేదంటూ ఉత్తర్వులివ్వడమే ఇందుకు కారణం. పదో తరగతి విద్యార్థుల మెరిట్‌ను గుర్తించి అడ్మిషన్లు చేయదలచుకున్న వారు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ సలహాను పాటించే పరిస్థితి లేదని ఆర్‌జీయూకేటీ భావిస్తోంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించడమే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు/మార్కుల ఆధారంగా చేయాలని ఆర్‌జీయూకేటీ చట్టం చెబుతోంది. అంతే తప్ప ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టేందుకు ఎలాంటి నిబంధనా లేదు. ఈ ఒక్క విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం చట్టాన్ని సవరించడం కష్టమైన పనిగా వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తే ఈ ప్రత్యేక యూనివర్సిటీ లక్ష్యమే దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.
ముందుకెలా?
ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించకుండా రాష్ట్రంలోని నూజివీడు, ఆర్.కె.వ్యాలీ(ఇడుపులపాయ), శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయడం ఎలాగని ఆర్‌జీయూకేటీ ఆలోచనలు చేస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష రాసే కంప్యూటర్ పరిజ్ఞానం, అవగాహన ఉండదని పేర్కొంటున్నారు. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్‌లైన్‌లోనూ టెస్ట్ నిర్వహించే ప్రసక్తే లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం పాస్ సర్టిఫికెట్లు కలిగిన పదో తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించే మార్గాలు ఏమున్నాయన్న కోణంలో ఆర్‌జీయూకేటీ అన్వేషిస్తోంది.
ముఖ్యంగా పాఠశాల విద్యలో విద్యార్థులకు సంబంధించిన డేటా ఏముంది, అంతర్గత పరీక్షల నిర్వహణ తీరు, వాటి విశ్వసనీయత వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలు , ఒక ఎస్‌ఏ పరీక్ష నిర్వహించారు. వీటిల్లో ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎఫ్‌ఏ-3 పరీక్షలకు సంబంధించిన మార్కులను దాదాపు 85 శాతం స్కూళ్లు పాఠశాల విద్యాశాఖకు అప్‌లోడ్ చేశాయి. అంతర్గత మార్కులు ఎత్తేశామంటూ ప్రభుత్వం ప్రకటన చేయడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఎఫ్‌ఏ-4, ఎస్‌ఏ-1 పరీక్షల మార్కులను అప్పట్లో చాలామంది అప్‌లోడ్ చేయలేదు
తాజా వాటిని అప్‌లోడ్ చేయమనడంతో ప్రైవేట్ స్కూళ్లు చేతివాటం ప్రదర్శించి ఫుల్ మార్కులు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అంతర్గత పరీక్షలకు సంబంధించి ఏ మార్కులను పరిగణనలోనికి తీసుకోవాలన్న దానిపై ఆర్‌జీయూకేటీ తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ ఈ ఏడాదికి లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు చేపట్టాలనున్నా కుదరదు! అది అహేతుకం అన్న అభియోగంతో న్యాయవివాదానికి అస్కారం ఇచ్చినట్లవుతుంది. ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, సీఎంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని ఆర్‌జీయూకేటీ భావిస్తోంది.
0 Comments:
Post a Comment