మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. 61 సంవత్సరాల శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి భోపాల్ లోని చిరాయు ఆస్పత్రిలో చేరనున్నారు. 'ప్రియమైన ప్రజలకు.. నాకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. కరోనా టెస్టులు నిర్వహించగా, రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. నేను ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తున్నా. డాక్టర్లు సూచించినట్టు క్వారంటైన్‌లో ఉంటున్నా.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. తన సహచరులు, తనను కలవడానికి వచ్చిన వారు కూడా వీలైనంత త్వరగా కరోనా టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. 'ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.
చిన్న అలసత్వం అయినా సమస్యలను కొనితెస్తుంది. వైరస్ రాకుండా నేను అన్ని చర్యలు పాటించాను. కానీ, ప్రజలు నన్ను చాలా సందర్భాల్లో కలిశారు.' అని చౌహాన్ మరో ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే అధికారులు, ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అందరూ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను కరోనా చికిత్స తీసుకునే సమయంలో హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మీటింగ్ నిర్వహిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే మిశ్రా కూడా కరోనా టెస్టులు చేయించుకోనున్నారు.రెండు రోజుల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో ఓ మంత్రి అరవింద్ సింగ్ బధోరియా కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌కు బధోరియా కూడా హాజరయ్యారు. అయితే, తన ఆరోగ్యం గురించి భయపడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చౌహాన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. 'ఏం భయపడొద్దు. కరోనా వైరస్‌కు సరమైన సమయంలో చికిత్స అందిస్తే కోలుకోవచ్చు.' అని చౌహాన్ చెప్పారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ మీద సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
0 Comments:
Post a Comment