ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని పునరుద్ఘటించింది. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా ఇంకా కట్టడిలోకి రాలేదు. పొరుగున ఉన్న తెలంగాణాతో పోల్చితే ఏపీలో కేసుల నమోదు ప్రస్తుతం తక్కువే ఉన్నప్పటికే అదుపులోకి వచ్చినట్లు కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సర ప్రారంభం పై అస్పష్టత కొనసాగుతోంది. కేంద్రం ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరు వరకు అన్ని విద్యా సంస్థలు మూసే ఉంటాయని స్పష్టం చేసింది.
ఆ తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితేనే స్కూళ్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. కేంద్రం చెప్పిన విధానాన్నే ఏపీ కూడా అమలు చేస్తోంది. అయితే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అంటే విద్యా సంవత్సరాన్ని వారు ప్రారంభించేసినట్లు లెక్క. అంతే కాకుండా విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఈ విషయాలు తమ దృష్టికి రావటంతో విద్యాశాఖ సీరియస్‌గా తీసుకుంటోంది. ఇంత వరకు విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించటం, ఫీజులు వసూలు వంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు టీచర్లకు జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న విషయం పై కూడా ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీని పై కూడా త్వరలో ఒక వైఖరి తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
0 Comments:
Post a Comment