పైసలిస్తే పది పాయింట్లే
‘ఇంటర్నల్’ మార్కుల్లో కాసుల వేట!
ఎఫ్ఏ-4 కోసం 5-10 వేలు డిమాండ్
పది పరీక్షల రద్దుతో కొత్త వ్యాపారం
తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ల ఫోన్లు
మా కాలేజీలో చేరితే మేం చూసుకుంటాం
రంగంలోకి కార్పొరేట్ జూనియర్ కాలేజీలు
10/10 గ్రేడ్ కూడా ఇప్పిస్తామని ఆఫర్
కేవలం 50 మార్కుల కోసం దందా
ఆ మార్కులు లేకున్నా పైతరగతులకు
తల్లిదండ్రుల అమాయకత్వంతో ఆటలు
రండి.. మా కాలేజీలో ఇంటర్ అడ్మిషన్ తీసుకోండి. పదో తరగతి ‘ఇంటర్నల్స్’ మాకొదిలేయండి! మంచి మార్కులు వేయిస్తాం.. ఏకంగా 10/10 గ్రేడ్ వచ్చేలా చూస్తాం’’ ఇది రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల ఆఫర్!
గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎఫ్ఏ పరీక్షల ఆధారంగానే మీ పిల్లలకు పదో తరగతి మార్కులు వేయాలి. వీటిని బట్టే గ్రేడ్లు కేటాయించాలి. ఇదంతా మా చేతుల్లోనే ఉంది. రండి మాట్లాడుకుందాం’’ ఇది విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న బ్లాక్మెయిలింగ్!
ప్రాధాన్యం లేకున్నా పైసల వేట
పదో తరగతి పరీక్షల రద్దుతో ఎఫ్ఏ పరీక్షల్లో విద్యార్థులు పొందిన మార్కులను అప్లోడ్ చేయాలంటూ పాఠశాల విద్యా కమిషనరేట్ తాజాగా ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఏ పరీక్షల మార్కుల అప్లోడింగ్ ప్రక్రియ మొదలైంది. పాఠశాల ఉపాధ్యాయులే ఈ మార్కులను ఇవ్వాల్సి ఉన్నందున.. దీన్ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రస్తుతం 50 మార్కులకు నిర్వహించిన ఎఫ్ఏ-4 పరీక్షల మార్కులను మాత్రమే పాఠశాలలు అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే, ఈ మార్కుల ప్రభావం పెద్దగా ఉండదంటున్నారు. కానీ, ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదన్న ఆలోచనతో కార్పొరేట్ విద్యా సంస్థలు అందిన కాడికి వసూలు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పాఠశాలల్లో నిర్వహించిన అంతర్గత పరీక్షలకు సంబంధించి అప్లోడ్ అయిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే ఈ తరహా దందాలకు ఆస్కారం ఉండేది కాదు.
కఠిన చర్యలు
పదో తరగతి విద్యార్థులకు మార్కులు, గ్రేడింగ్ ఇచ్చేందుకు నిర్దేశించి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల మార్కులను ఇష్టానుసారంగా వేసు కునే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్య ముఖ్య కార్య దర్శి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు హెచ్చరించారు.
0 comments:
Post a comment