వాట్సాప్‌లో ఆ ఫీచర్: ఈసారి పక్కా..!
ఇంటర్నెట్‌డెస్క్: సందేశాలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు ఇలా వాట్సాప్ ద్వారా చాలా పంచుకోవచ్చు. అయితే, ఎంతోకాలంగా వాట్సాప్ వినియోగదారులను ఊరిస్తున్న ఫీచర్ వాట్సాప్-పే. గత రెండేళ్లుగా భారత్‌లో వాట్సాప్-పే బీటా టెస్టింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ సదుపాయం అధికారికంగా అందుబాటులోకి రాలేదు. తాజాగా నివేదిక ప్రకారం మే చివరి నాటికి వాట్సాప్-పే అందరికీ అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల సాయంతో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుతానికి తన సేవలను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. ఇందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇప్పటివరకూ వాట్సాప్-పే అధికారికంగా రాకపోవడానికి కారణం భారతీయ రిజర్వ్ బ్యాంకు విధించిన నియమాలు, నిబంధనలే. ఇప్పుడు వాట్సాప్ వాటన్నింటినీ పూర్తి చేసిందట. మరోవైపు దేశమంతటా ఒకేసారి వాట్సాప్-పే సేవలను అందుబాటులోకి తెస్తే, బ్యాంకులపై భారం పడే అవకాశం ఉండటంతో దశల వారీగా దీన్ని అమలు చేయాలని వాట్సాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫిబ్రవరి 2018న వాట్సాప్-పే సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, వాట్సాప్ మరింత సక్సెస్ అవుతుందని సంస్థ భావిస్తోంది. అంతేకాదు, దీన్ని వినియోగించడం కూడా సులభమని చెబుతోంది. కేవలం చెల్లింపుల కోసం ప్రత్యేకంగా మరో యాప్‌ను వినియోగించాల్సిన అవసరం లేదని అంటోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే చెల్లింపుల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ పే, పేటీఎంలకు గట్టి పోటీ ఎదురుకానుంది.
0 Comments:
Post a Comment