అప్రమత్తతతోనే ఆస్తమా నివారణ
(తేది:5/5/2020 ఆస్తమా నివారణ దినం)
ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం. ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి. ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాల కారణంగా చెప్పవచ్చును. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణము. ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువలన పట్టణాలలోని వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉంది. శ్వాసకోశాలు, జీవితపు మనుగడకు అవసరమైన ప్రాణవాయువును శ్వాసప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజూ మన శ్వాసకోశాలు, పలురకాల వాతావరణ పరిస్థితులు, ఎలర్జైన్లు, రసాయనాలు, పొగ, దుమ్ము, దూళి తదితర అంశాలకు లోనవుతుంటాయి. వీటివల్ల వివిధ రకాల దీర్ఘవ్యాధులు వస్తాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి, శరీరానికి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జైన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందించి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వల్ల మన శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం రావడం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడం, ముక్కునుంచి నీరు రావడం, తరుచూ జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యుసంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. లేదా అప్పటికే ఆస్తమా ఉంటే ఈ కారణాలతో మరికాస్తా పెరగవచ్చు. ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి. దుమ్మూదూళికి దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు. చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు,, ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ, పుప్పొడి రేణువులు, ఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి.
- యం.రాంప్రదీప్
జన విజ్ఞాన వేదిక
తిరువూరు
9492712836
0 Comments:
Post a Comment