అంబేద్కర్ అడుగుజాడల్లో..
(తేదీ:14/4/2020 అంబేద్కర్ జయంతి సందర్భంగా)
రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉపన్యాసంలో నాయకుడిని గుడ్డిగా నమ్మి పూజించడమనే చెడు మనస్తత్వం భారతీయుల్లో అనాదిగా జీర్ణించుకుని ఉన్నది. దేశానికి, ప్రజానీకానికి నిస్వార్ధంగా సేవ చేసిన నాయకుని గౌరవించడంలో తప్పులేదు. కానీ ఆ నాయకున్ని సర్వశక్తి సంపన్నుడుగా ఎంచి సమస్తమైన బాధ్యతలు ఆయనపైనే ఉంచి, అన్యధా శరణం నాస్తి అనే ధోరణిలో ప్రజానీకం వ్యవహరించడం అత్యంత విషాదకర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ వ్యక్తి పూజ విధానం దేశానికి, ప్రజానీకానికి అత్యంత నిమ్నదశగా దిగజారుస్తుంది. దేశ స్వాతంత్రంను పరిరక్షించుకునే విషయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం అనేది ప్రమాదకరమన్నారు. మన భారతదేశంలో భక్తి తత్వం అనేది అత్యంత దారుణమైన విధంగా ఉంటున్నది. ఈ భక్తితత్వం నింపాదిగా రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నది. వ్యక్తి పూజ దేశాన్ని కృంగదీసి సర్వ ఆధిపత్యానికి దారితీస్తుంది. అంచేత రాజకీయాల్లో భక్తి తత్వానికి వ్యక్తిపూజకు ఏ మాత్రం తావియ్య రాదు. మనిషిని మనిషిగా చూడటమే అంబేద్కరిజం. “చరిత్ర తెలియనివారు చరిత్రని నిర్మించలేరు” అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. అసలైన బహుజన చరిత్ర తెలియని కొందరు నాయకులు చేసే అర్ధం పర్ధంలేని హంగామావల్లే అంబేద్కర్ గురించి నేటి తరంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. బహుజన వైతాళికులైన పూలే, సాహు, నారాయణగురు, పెరియార్, అంబేద్కర్ అనంతరం దేశంలో బహుజన ఉద్యమంలో శూన్యత ఏర్పడింది. కొందరు కుహనా నాయకులు, రచయితలు అంబేద్కర్ ఆలోచనలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసారు. వాళ్ళు అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని వివరించే మేధావులుగా ముందుకొచ్చారు. 1956లో బాబాసాహెబ్ మరణించే నాటికి పూలే, అంబేద్కర్ ఉద్యమానికి భవిష్యత్తు కనుచూపు మేరలో కన్పించలేదు. బామ్ సెఫ్ , దళిత ఫాంథర్స్ వంటి ఉద్యమాలు అంబేద్కర్ ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళడానికి దోహద పడ్డాయి. ఎందరో చదువుకున్న బహుజన యువకులు ఉద్యమంలో చేరి తమ రచనల ద్వారా, ఉపన్యాసాలద్వారా అణగారిన వర్గాల వారిలో చైతన్యం నింపారు. వారి సమస్యలపై స్పందించారు. సరైన నాయకత్వం, దీర్ఘకాలిక లక్ష్యం లోపించడం వల్ల ఈ ఉద్యమాలు బలహీన పడ్డాయి. కానీ రామ్ కృషితో అంబేద్కరిజం పునరుజ్జీవం పొందింది. మహారాష్ట్రలో సాంప్రదాయ పార్టీలు పన్నిన పన్నాగంలో కొందరు అంబేద్కర్ వాదులు చిక్కుకు పోవడంతో పూలే, అంబేద్కర్ ఆలోచనా విధానానికి ఒక అస్తిత్వం లేకుండా పోయింది. అంబేద్కర్ మానసిక పుత్రికలైన సమతా సైనిక దళ్ (రాజకీయేతర విభాగం) బుద్దిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (సాంస్కృతిక విభాగం), రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ఆధిపత్య వర్గాల వారి నుండి రక్షణ పొందుటకు అణగారిన వర్గాల వారు బాగా చదవడమే ఏకైక మార్గమని అంబేద్కర్ తెలిపారు. చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొందిన యువకులు తమ వర్గాల వారి ప్రయోజనాలని కాపాడాలని ఆయన కోరారు. అయితే నాటి విద్యావంతులు తమ వర్గ ప్రయోజనాలని విస్మరించారు. తమ జాతి ప్రజల శ్రేయస్సును కాపాడలేకపోతే తనను తాను కాల్చుకుంటానని అంబేద్కర్ ప్రకటించారు.
అంబేద్కరిజం స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరుకుంటుంది. అంబేద్కరిజంలో వీర విధేయతకు తావులేదు. లొంగుబాటుకు స్థానం లేదు. అంబేద్కర్ ప్రకారం గ్రీసు, బాబిలోనియా, ఈజిప్ట్ నాగరికతల కంటే మన సింధు నాగరికత గొప్పది. స్వేచ్ఛా, సమానత్వం, సహోదరత్వం, సమన్యాయం, శ్రమ సంస్కృతి వంటి వాటిని మనదేశం ప్రపంచానికి అందించింది. 1981లో స్థాపించబడ్డ దళిత సోషిత్ సమాజ సంఘర్ష్ సమితి ( డిఎస్4 ) కూడా అంబేద్కర్ భావజాల వ్యాప్తికి కృషిచేసింది. మనిషిని మనిషిగా చూడలంటారు అంబేద్కర్. అంబేద్కరిజంలో వ్యక్తిగత ఆరాధనకు చోటులేదు. అంబేద్కరిజం స్వల్పకాల రాజకీయ ప్రయోజనాలని ఆశించదు. రాజకీయాలు సమాజ కేంద్రంగా జరగాలని ఆయన సూచించారు. యువత శాస్త్రీయ ఆలోచనలని పెంచుకొని, మూఢనమ్మకాలని విడనాడాలని కోరారు. అంబేద్కరిజంతో దూషణలకు ఆస్కారం లేదు. అంబేద్కరిజంలో ద్వేషానికి తావులేదు. దురదృష్టవశాత్తు ఈనాడు నిమ్మ వర్గాల వారిని కూడా కేవలం ఓటు బ్యాంక్ గా చూసే సంస్కృతి పెరిగింది. అంబేద్కర్ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు నిమ్నవర్గాల వారికి అందాలని ఆశించారు. భారతదేశంలో మతం మార్పిడులు జరుగుతాయి కానీ, కుల మార్పిడీలు పెద్దగా జరగవు. నిమ్నవర్గాల వారు మతం మారినా వ్యక్తిగత ఆరాధన తగ్గలేదు. వారిలో అత్యధిక మంది ఇంకా ఎవరో వచ్చి తమని రక్షిస్తారనే భ్రమలలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాల వారు మద్యానికి బలౌతూనే వున్నారు. నిరక్షరాస్యత వెంటాడుతూనే వుంది. ఇంకా నిమ్న వర్గాల మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిద్దరికి రాజకీయ పదవులు వచ్చినంత మాత్రాన దళిత సాధికరత వచ్చినట్లు కాదు. అంబేద్కర్ మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ శూన్యత ఇప్పుడు కూడా కన్పిస్తుంది. దళిత ఉద్యమాలు విడివిడిగా సాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ ద్వారా లేదా తమ ప్రతిభ ద్వారా ఉన్నతస్థానంలో ఉన్న అణగారిన వర్గాల యువతీయువకులు, అధికారులు తమ సమయం, మేధస్సు, డబ్బులో కొంత భాగాన్ని తమ జాతి ప్రయోజనాలకి కేటాయించాలి. దళిత ఫాంథర్స్ లాంటి వంటి ఉద్యమాలు రావాలి . అణగారిన వర్గాల సమస్యలని వెలుగులోకి తేవడానికి, వారి రచనలని ప్రచురించడం కోసం అప్పట్లో 'లిటిల్ మ్యాగ్జైన్' ఉద్యమం ప్రారభించబడింది. ఇప్పుడు కూడా ఒక స్వతంత్ర ప్రచురణ విభాగం ఉండాలి. బుద్ధుని ఆలోచనలకి ప్రాముఖ్యత నివ్వాలి. 1951 ప్రాంతంలో అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కార్టూనిస్టులు కూడా ఆయనని అపహాస్యం చేశారు. ఆయనని విలన్ గా చిత్రించారు. తెలుగువాడైన ఉన్నమతి శ్యామ్సుందర్ ఈ విషయంపై పరిశోధన చేసి ‘నోలాఫింగ్ మేటర్' అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. ఇప్పుడు మరిన్ని పూలే, అంబేద్కర్ అధ్యయన కేంద్రాలు ఏర్పడాలి. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. తాత్కాలిక తాయిలాలు రాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు న్నివర్గాల వారు ఉద్యమించాలి. ఇప్పుడు అంబేద్కరిజంపై పరిశోధనలే కాదు, ప్రచారం కూడా జరగాలి . అందుకు శ్యామ్ సుందర్ వంటి అంబేద్కర్ వాదులని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే అంబేద్కర్ వాదులు లౌకిక , వామపక్ష ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి సంస్థలు మరియు వ్యక్తుల సహకారం తీసుకొని ఐక్యకార్యాచరణ ప్రకటించి ఉద్యమాలు చేయవలసిన అవసరం వుంది. అంబేద్కర్ పోరాటాన్ని కేవలం దళిత హక్కుల పోరాటం గానే చూడకుండా, మానవ హక్కుల సాధనకు చేసిన గొప్ప ఉద్యమంగా అభివర్ణించవలసిన అవసరం వుంది. ఈ దిశగా అంబేద్కర్ వాదులు కృషిచేయాలి. అప్పుడే కుల వ్యవస్థ లేని అభినవ భారతదేశం ఏర్పడుతుంది.
యం.రాంప్రదీప్
సెల్ నెం . 9492712836
0 Comments:
Post a Comment