న్యూఢిల్లీ: లోక్ కల్యాణ్ మార్గ్ 7లోని ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్, ఆర్థిక వ్యవస్థపై చర్చించామని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామన్న ఆయన దాడులను అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్ తేబోతున్నామని ప్రకటించారు. దాడులకు పాల్పడితే 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. బెయిల్ కూడా లభించబోదని చెప్పారు. రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తామని జవదేకర్ తెలిపారు. తీవ్రంగా గాయపరిచిన కేసుల్లో ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని, రూ.లక్ష నుంచి రూ.5లక్షల జరిమానా విధిస్తామన్నారు. 30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు. దాడులు చేసిన వారి దగ్గరే నష్టపరిహారం వసూలు చేస్తామన్నారు. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేస్తామని చెప్పారు. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్ తెలిపారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధానికి వివరించారు. తమకు తగిన రక్షణ కల్పిస్తేనే తాము తలపెట్టిన ఆందోళన విరమిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తనతో చెప్పిన విషయాన్ని కూడా షా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై లోతుగా చర్చించిన కేంద్ర కేబినెట్ వైద్య సిబ్బందిపై దాడి జరిపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు.
0 Comments:
Post a Comment