అక్షయ తృతీయ @ ఆన్‌లైన్
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదనేది చాలా మంది విశ్వాసం. ధర ఎంతున్నా ఆ రోజున చిన్న మొత్తంలో అయినా బంగారం కొనాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. బంగారం దుకాణాలు సైతం మూతపడ్డాయి. దీంతో ఈ సారి అక్షయ తృతీయ (ఏప్రిల్ 26న)కు బంగారం ఎలా కొనుగోలు చేయాలనే దానిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పసిడి విక్రయశాలలు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాయి. ప్రజలకు తమ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు సిద్ధమని ప్రముఖ బంగారం దుకాణ సంస్థలైన తనిష్క్, కల్యాణ్ జ్యూయలర్స్ ప్రకటించాయి.
టాటా గ్రూపునకు చెందిన బంగారు నగల తయారీ సంస్థ తనిష్క్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 వరకు వినియోగదారులు తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో నచ్చిన నగలను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఇందుకోసం తమ సిబ్బంది వీడియో కాల్, ఆన్‌లైన్ ఛాటింగ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటారని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారు, లాక్‌డౌన్ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆ బంగారాన్ని వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని, లేదంటే వినియోగదారులే దగ్గర్లోని తమ దుకాణం వద్ద తాము కొనుగోలు చేసిన వస్తువుని పొందవచ్చని తెలిపింది. ''మా వినియోగదారుల్లో 54 శాతం మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆన్‌లైన్లో వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించాం'' అని తనిష్క్ ఒక ప్రకటనలో తెలిపింది.
అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని చాలా మంది సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా విచారిస్తున్నారని కళ్యాణ్ జ్యూయలర్స్ పేర్కొంది. అందుకే కొనుగోలుదారుల కోసం తమ సేవలను ఏప్రిల్ 21 నుంచి ఆన్‌లైన్‌లో అందివ్వనున్నట్లు ప్రకటిచింది. కొనుగోలుదారులు రెండు గ్రాముల నుంచి ఆపై ఎంత మొత్తంలో అయినా బంగారం కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అయితే కొనుగోలు పూర్తయిన తర్వాత సంస్థ 'గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్' పేరుతో కొనుగోలు ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తామని, ఆ పత్రాన్ని వినియోగదారులు కోరుకున్న పద్ధతిలో అక్షయ తృతీయ రోజున వారికి అందిస్తామని తెలిపింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ధ్రువీకరణ పత్రంతో తాము కొనుగోలు చేసిన నగను పొందవచ్చని తెలిపింది. ''దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో మొదటిసారిగా ఈ తరహా విధానాన్ని పాటిస్తున్నాం. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం'' అని సంస్థ సీఎండీ టీఎస్ కల్యాణ్ రామ్ తెలిపారు.
0 Comments:
Post a Comment