బీజింగ్: కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన చైనాలో పరిస్థితి మెల్లగా కుదుటపడుతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుముఖం పడుతుండంతో అక్కడి పాఠశాలలు తిరిగి తెరుకుంటున్నాయి. విద్యార్థులు క్రమంగా తరగతులకు హాజరవుతున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. అలానే వైరస్ వ్యాపించకుండా విద్యార్థుల మధ్య సామాజిక దూరం ఉండేలా అక్కడి పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం హాంగ్‌జోవు నగరంలోని ఒక పాఠశాల కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. విద్యార్థులు సామాజిక దూరం పాటించాలనే విషయాన్ని గుర్తుచేసేందుకు వారు తలపై ధరించే విధంగా మూడు అడుగుల పొడవు ఉండేలా అట్టలు, బెలూన్లతో వైవిధ్యమైన టోపీలను తయారు చేశారు. దానితో పాటు విద్యార్థులతో మాస్కులు కూడా ధరింపజేశారు.
విద్యార్థులు మాస్కులు, రంగు రంగుల టోపీలను ధరించి తరగతి గదిలో కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను యూనివర్శిటీ ప్రొఫెసర్ ఐలీన్ చెంగియాన్ చౌ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘సామాజిక దూరం పాటించేలా విద్యార్థులు టోపీలు ధరించి స్కూలుకు హాజరయ్యారు. సాంగ్ రాజవంశీయులు ఈ తరహా టోపీలను కోర్టు తీర్పు సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండేందుకు ధరిస్తారు. ఈ టోపీల ముఖ్య ఉద్దేశం సామాజిక దూరం పాటించడం’’ అని రాసుకొచ్చారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘ఇది ఎంతో గొప్ప ఆలోచన, ఆసక్తికరంగా ఉంది’, ‘విద్యార్థులు రక్షణ కోసం ఇది ఎంతో బావుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
0 Comments:
Post a Comment