జమ్ము: కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో వారిని కట్టడి చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘించి.. ఏ కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన కొందరు వ్యక్తులపై జమ్ము కశ్మీర్‌లోని రణ్‌బీర్ సింగ్ పురా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. వారి చేతులు, నుదుటిపై తుడుచుకోవడానికి సాధ్యం కాని ఇంకుతో స్టాంపు వేశారు. దీనిపై కరోనా లాక్‌డౌన్ అతిక్రమణదారు అనే మాటలతో పాటు... సంబంధిత పోలీస్‌స్టేషన్ పేరు కూడా ఉంటుంది. కాగా ఈ స్టాంపు కనీసం 15 రోజులు నిలిచి ఉంటుందని పోలీసులు వివరించారు. వారు మళ్లీ ఈ తప్పు చేయకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా కాకుండా వారు మళ్లీ రోడ్డుపైకి వస్తే గుర్తించటం కూడా సులభమవుతుందని వివరించారు. ఇప్పటికే క్యారంటైన్‌లో ఉంటున్నవారిని గుర్తించే విధంగా ఇలాంటి స్టాంప్‌లను వేస్తున్న విషయం తెలిసిందే.
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో గురువారం నాటికి 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా లాక్‌డౌన్ అమలులో ఉంది. దీంతో ఆకతాయిలకు బుద్ధి చెప్పటానికి బిష్ణో పట్టణ పోలీసులు కూడా రణ్‌బీర్ సింగ్ పురా పోలీసులనే అనుసరిస్తున్నారు.
0 Comments:
Post a Comment