విద్యార్థిని అభినందిస్తున్న డీఈవో సుబ్బారావు, ఉపాధ్యాయులు
పశ్చిమాన...శశిధరుడు!
ప్రధానమంత్రి పరీక్ష పే చర్చకు ఎంపిక
4,455 మందితో పోటీపడి అర్హత
ముండ్లపాడు విద్యార్థి ప్రతిభ
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. పట్టుదలకు ఆర్థిక స్తోమత ప్రామాణికం కాదు. సాధించాలన్న కసి... ఎదగాలన్న తపన... క్రమశిక్షణతో ముందడుగు వేస్తే విజయం తథ్యమని నిరూపించాడు విద్యార్థి పాతకోట శశిధర్. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఎంపికై... ఔరా అనిపించాడు. గిద్దలూరు మండలం ఓబులాపురానికి చెందిన దిబ్బారెడ్డి, భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. పేదరికంలో పుట్టిన సరస్వతీ పుత్రుడికి చిన్నతనం నుంచే చదువుపై మక్కువ ఎక్కువ. ముండ్లపాడులోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో ఉంటూ... గంజి భద్రయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి(ఆంగ్ల మాధ్యమం) అభ్యసిస్తున్నాడు. ‘విద్యార్థుల్లో ఒత్తిడి లేని విద్యావిధానం’పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘పరీక్ష పే చర్చ-2020’ ఎంపికకు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆన్‌లైన్ పరీక్ష రాశాడు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల నుంచి రాష్ట్రం నుంచి ఒకడే ఎంపికయ్యాడు.ఎంపిక విధానమిది...
పరీక్ష పే చర్చ ఎంపికకు గతేడాది డిసెంబరు 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 4,455 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శశిధర్‌రెడ్డి ఆన్‌లైన్ పరీక్షలో సహజ వనరుల వినియోగం అంశాన్ని ఎంచుకొని... నిర్ణీత కాల వ్యవధిలో సమాధానాలు నమోదు చేశాడు. ప్రతిభ ఆధారంగా ఈ నెల 20న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరగనున్న పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా 28 మంది విద్యార్థులు కార్యక్రమానికి అర్హత సాధించగా- అందులో పశ్చిమ ప్రకాశం నుంచి శశిధర్‌రెడ్డి ఉండటం విశేషం.ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే...
మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. నా చదువు అమ్మానాన్నకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ముండ్లపాడులోని వసతి గృహంలో ఉంటూ అక్కడి ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. ఒత్తిడి లేని విద్యా విధానంపై ప్రధానమంత్రితో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు గత నెల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల సహకారంతో సహజ వనరుల వినియోగంపై అంశాన్ని ఎంచుకున్నా. ఆ విభాగంలో ప్రతిభ చూపడంతో అర్హత సాధించా. ప్రధాని మోదీని కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
- పాతకోట శశిధర్‌రెడ్డి, విద్యార్థి, ముండ్లపాడు
0 Comments:
Post a Comment