విద్యా దీప్తి - ఫాతిమా బేగం(జనవరి 9, భారత దేశపు తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా జయంతి సందర్భంగా)
ఫాతిమా షేక్ ఒక భారతీయ విద్యావేత్త, ఫాతిమా సామాజిక సంస్కర్తలయిన జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులేలతో కలిసి బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేసినది. ఫాతిమా షేక్ ఉస్మాన్ యొక్క సోదరి. ఫూలే దంపతులు గృహ బహిష్కరణకు గురి అయినప్పుడు షేక్ ఉస్మాన్ ఇంట్లోనే ఫులే దంపతులు నివాసం ఉన్నారు. షేక్ ఫాతిమా బేగం ఆధునిక భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయులలో ఆమె ఒకరు. దళిత పిల్లలు, బాలికల కొరకు పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం ప్రారంభించింది. జ్యోతిబా, సావిత్రిబాయి ఫులేలతో కలిసి షేక్ ఫాతిమా అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతలు చేపట్టారు. ఫాతిమా షేక్ మరియు సావిత్రిబాయి ఫులే మహిళలకు మరియు అణగారిన కులాలకు చెందిన వారికి బోధించడం ప్రారంభించినపుడు వారిని స్థానికులు బెదిరించారు. వారి కుటుంబాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు మరియు వారు చేస్తున్న విద్యా కృషిని ఆపమని, లేదా ఇంటిని విడిచిపెట్టివెళ్ళాలని ఒత్తిడి చేశారు. అప్పుడు వారికి కులం నుంచి గాని, కుటుంబం నుంచి గానీ, సమాజ సభ్యులు నుంచి గానీ, వారి పోరాటానికి ఎటువంటి మద్దతు దొరకనప్పటికీ వెనకడుగు వేయలేదు. ఫూలే దంపతులు పూణేలోని గంజ్ పేట లో నివసిస్తున్న ముస్లిం వ్యక్తి ఉస్మాన్ షేక్ ను కలిసి అడుగగా పాఠశాల ఏర్పాటు కోసం ఉస్మాన్ షేక్ తన ఇంటిని ఫులే దంపతులకు ఇచ్చాడు. పాఠశాలను నడపడానికి అంగీకరించాడు. ఆ విధంగా 1848 లో ఉస్మాన్ షేక్ మరియు ఆమె సోదరి ఫాతిమా షేక్ ఇంట్లో ఒక పాఠశాల ప్రారంభించబడింది.అప్పటి కాలంలో విద్య అనేది ఉన్నత కులాల పురుషులకు మాత్రమే అనే అభిప్రాయం ఆనాటి భారతీయ సమాజంలో ఉండేది. స్త్రీలు మరియు అట్టడుగు వర్గాలకు విద్యను అందించే ఆలోచన అందరూ వ్యతిరేకించిన కాలంలో ఫాతిమా మరియు ఆమె సోదరుడు ఉస్మాన్ ఫూలే దంపతులకు మద్దతుగా ఉండి బాలికల విద్యా వ్యాప్తికి తమ సహాయ సహకారాలు అందించారు. పూణేలోని గంజ్ పేట్ ప్రాంతంలోని తమ ఇంటి నందు పులే దంపతులు ఆశ్రయం పొందటమే కాక ఫాతిమా తో కలిసి బాలికల కొరకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. అపుడు తమ సొంత బంధువులతో సహా ప్రతి ఒక్కరూ ఈ సామాజిక సంస్కర్తలను విడిచిపెట్టిన సమయంలో, ఫాతిమా మరియు ఉస్మాన్ అట్టడుగు వర్గాల వారి అభివద్ధికి విద్య దోహదపడుతుందని, ఫూలే దంపతుల ఆశయాన్ని సాధించేందుకు వారికి అవకాశాన్ని ఇవ్వడమే కాక, వారికి ఆశ్రయం కూడా ఇచ్చారు. షేక్ ఉస్మాన్ ఇంటి వద్ద, ఫాతిమా సావిత్రిబాయికి పూణేలో బాలికల కోసం 'ఇండిజీనస్ లైబ్రరీ' అని పిలిచే మొదటి పాఠశాలను స్థాపించడానికి సహాయం చేసింది. షేక్ ఉస్మాన్ ప్రోత్సాహంతో ఫాతిమా ఉన్నత విద్యను అభ్యసించింది. అప్పట్లో సామాన్యులకు పాఠశాలలు ఉండేవి కావు. క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లోనే ఫాతిమా చదువుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సావిత్రి, అన్న సహకారంతో ఫాతిమా చదువుకొని మనదేశంలో తొలితరం మహిళా ఉపాధ్యాయులు పేరు పొందారు. ఫాతిమా భావాలు చాలా విశాలమైనది.
సయ్యద్ నస్రీన్ ఫాతిమాపై పుస్తకాన్ని రాశారు. సావిత్రిబాయి పలు రచనలు చేసినందువల్ల ఆమె గురించి వివరాలు సేకరించేందుకు చరిత్రకారులు వీలు పడింది. "ఫాతిమా నాకు బాగా సహకరించారు. ఆమె సహకారంతో నేను సేవ కార్యక్రమాలను కొనసాగించగలిగాను" అంటూ సావిత్రి తన భర్తకు రాసిన లేఖలలో పేర్కొంది. ఫాతిమా సేవా కార్యక్రమాలపై పెట్టినంతగా సాహిత్యంపై దృష్టిపెట్టలేదు. ఆ రోజుల్లో సనాతన ముస్లింలు స్త్రీ విద్యని వ్యతిరేకించినప్పటికీ ఆమె పట్టుదల అంతా ముస్లిం బాలికలని చదువుకోమని ప్రోత్సహించింది. 1825 - 27 మధ్యకాలంలో జనవరి 9న ఫాతిమా జన్మించినట్లు చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. సాహిత్యంపై ఫాతిమా పెద్దగా దృష్టి పెట్టకపోవడం, ముస్లిం సాహితీవేత్తలు కూడా ఆమెపై పరిశోధనలు చేయకపోవడం వల్ల ఆమె గురించి మనకు తక్కువగా వివరాలు లభ్యమవుతున్నాయి. నస్రీన్ ప్రకారం ఫాతిమా ఉర్దూలో పద్యాలు రాశారు. కులం లేని సమాజం కోసం ఆమె పరితపించారు. సుగుణభాయి, సావిత్రిబాయి, ఫాతిమాబేగంలు కలిసి బాలికా విద్యపై ఎనలేని కృషి చేశారు. బహుజనుల, ముస్లింల ఐక్యతా ఉద్యమాలకై వారు బీజం వేశారు. 1856 తర్వాత ఫాతిమా ఎక్కడ నివసించారనే విషయంపై వివరాలు దొరకడం లేదు. ఫాతిమా బేగం వివాహం, తరువాతి పితృస్వామ్యం మరియు సనాతన ధర్మం మొదలయిన వాటిని ఆమె వ్యతిరేకించింది. మహారాష్ట్ర స్టేట్ బ్యూరో ఆఫ్ టెక్స్ట్‌బుక్ ప్రొడక్షన్ అండ్ కరికులం రీసెర్చ్ 2014 లో వారి పాఠ్యపుస్తకాల్లో ఆమె చేసిన సహకారాన్ని గుర్తించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠ్యపుస్తకాలలో ఆమె గురించి ప్రచురించారు. ఫాతిమా షేక్ స్ఫూర్తితో పాట్నా, కలకత్తాలలో ముస్లిం బాలికలకు బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సంఘసంస్కర్తల కృషి ఫలితంగా బాలికల కోసం పాఠశాలలు, కళాశాలలు దేశ వ్యాప్తంగా స్థాపించబడ్డాయి. చరిత్రకారులు దృష్టి పెట్టి ఫాతిమా సమాజానికి చేసిన సేవలు మరింత వెలుగులోకి తీసుకోరావాల్సి ఉంది. ఈరోజున విద్యావంతులైన ప్రతి భారతీయ మహిళ సావిత్రిబాయి ఫులే మరియు ఫాతిమా షేక్‌లకు కృతజ్ఞతతో రుణపడి ఉండాలి. అదృష్టవశాత్తూ నేడు ఆమె బాలికావిద్య కోసం చేసిన కృషి, ఫూలే దంపతులకు అందించిన సహకారాన్ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నేడు పిల్లలు, లింగం, కులం, మతంతో సంబంధం లేకుండా విద్యను పొందగలుగుతున్నారంటే ఆనాడు ఫూలే దంపతులు, షేక్ ఫాతిమా బేగం లాంటి వారి కృషి ఫలితమేనని మనం గుర్తించాలి.
- వాసిలి సురేష్
9494615360
Fathima Sheikh first Muslim Teacher of India in Telugu -
Written by M. RamPradeep,
Documentary by Vasili Suresh,
Voice Over By Atmakuru Bharathi..
యూ ట్యూబ్ వీడియో చూడండి...
https://youtu.be/g8ixqURa5E4
0 Comments:
Post a Comment