ఒక నిషేధం! ఒక నిర్బంధం! ఇదీ ఇంగ్లీష్ మీడియం సారాంశం
ఈ వ్యాస కర్త:
V. బాలసుబ్రహ్మణ్యం, MLC
ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు
ప్రభుత్వం మాధ్యమం మీద పడింది. పనిలో పనిగా తెలుగుతోపాటు ఉర్దూ తమిళం, ఒరియా, కన్నడం మీడియాలకు కూడా మంగళం పాడింది. పేదలకోసమే ఇంగ్లీషుకు పట్టాభిషేకం చేస్తున్నామని, ఉద్యోగాల కోసమే ఇంగ్లీషు భూమ్మీద అవతరించిందని, నాలుగు బొట్టేరు ముక్కల ఇంగ్లీషు చిలకపలుకులు వల్లింపజేస్తే సామాజికార్థిక వివక్షలన్నీ అదృశ్యమై పోతాయని మనల్నిందరినీ నమ్మమంటోంది. కాదంటే మీరంతా పేదల శత్రువులని, మనవళ్ళు, కొడుకులూ ఎక్కడ చదువుతున్నారని ఎదురుదాడి చేస్తోంది.
ఇంగ్లీషు ప్రాధాన్యత తెలియని వారూ, పేదలకు ఇంగ్లీషును వ్యతిరేకించేవారూ ఎవ్వరూ వుండరు. ఉద్యోగాల కోసమే గాదు ఆధునిక సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించాలన్నా, ప్రపంచ జ్ఞానంలో వెనకబడకుండా వుండాలన్నా ఈ రోజు ఇంగ్లీషు అవసరం. ఈ (దు)స్థితి మన దేశానికెందుకొచ్చిందనేది వేరే విషయం చారిత్రకంగా మనం పలు కారణాలరీత్యా ఇంగ్లీషు వలయంలో చిక్కుకున్నాం.
జరగాల్సింది అకడమిక్ చర్చ
సమస్యంతా ఇంగ్లీషును ఎలా ఎప్పటినుంచి నేర్పాలన్నది. ఎవరికి ఎలా నేర్పాలన్నది. భాషగా ఇంగ్లీషు ఎంత అవసరం మీడియంగా ఎంత అవసరం అన్నది. అలాగే మాతృభాష పాత్ర, స్థానం పిల్లల అభ్యసనంలో ఎంత అన్నది. ఇలా చర్చ అకడమిక్ గా జరిగితే మంచిది. ఇది రాజకీయ, మతావేశాల చర్చగా మారితే అసలు విషయం వెనక్కి వెళ్తుంది. అలా వెళ్ళాలనే వారే దీన్ని ప్రక్కదారి పట్టిస్తుంటారు. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం సరిగ్గా ఉద్దేశపూర్వకంగానే దీనికి పూను కొంటున్నారు.
ఆచరణలో ప్రభుత్వం చేసింది. మాతృభాషా మాధ్యమాన్ని నిషేధించడం, ఇంగ్లీషు మీడియంను నిర్బంధంగా రుద్దడం. ఇప్పటికీ రాష్ట్రంలో 62శాతం పిల్లలు, దళితుల్లో 50%మంది పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో వున్నదంతా ఇంగ్లీషు మీడియమే. సర్కారు బడుల్లోనూ, మోడల్ ప్రాథమిక పాఠశాలల్లోనే గాక, తల్లిదండ్రులు తీర్మానించినచోట ఇంగ్లీషు మీడియం వుంది. ఇక హైస్కూళ్ళలో సక్సెస్ స్కూళ్ళు గురుకులాలు, కస్తూర్బా, మోడల్ స్కూళ్ళు ఇలానే వున్నాయి. వీటన్నిటినీ ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. కారణం ఇవి తల్లి దండ్రులు కోరుకొన్నవి కావడం. ఉన్నత పాఠశాలలు కావడం. కోరుకొంటే తెలుగు మాధ్య మం కూడా వీటిలో వుండటం.
ప్రజలు పిల్లలు ఇంగ్లీషు తమకు తప్పనిసరి అనుకొనివుంటే ఇప్పటికే ప్రాథమిక పాఠశాలన్నీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా చట్టబద్ధంగానే మారిపోయ్యివుండేవి. ఎందుకు మారలేదు మరి? హైస్కూళ్ళ లో తెలుగు మీడియంనుంచి అందరూ ఆంగ్ల మాధ్యమానికి వెళ్ళి పోయ్యేవారు. ఎందుకు పోలేదు మరి?
విద్య చుట్టూ విష సంస్కృతి
అసలు విద్య చుట్టూ ఒక విష సంస్కృతిని మన కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు అల్లి పెట్టాయి. ఈ గచ్చపొదల్లో మధ్య తరగతి చిక్కుకుపోయ్యింది. ఈ సంస్కృతిలో ఇంగ్లీషు మాధ్యమం ఒకటి. ఉద్యోగాలకంటే ఒక శిష్టవర్గంగా గుర్తింపుకు కూడా వీళ్ళకి ఇంగ్లీషు అవసరం. మూడవ తరగతి నుంచి ఐఐటిలకు కోచింగు, ఆట పాటలకు నోచుకోని బాల్యం, మార్కులు, ర్యాంకింగుల చుట్టూ చదువులు, వీలునన్ని పని దినాలు - పని గంటలు, తీవ్రమైన ఒత్తిడి, ఆర్భాటాలు - హంగామాలు ఇవన్నీ ఈ సంస్కతిలోంచి వచ్చినవే. కార్పొరేట్లు తెచ్చినవే. మధ్య తరగతి నెత్తినబెట్టుకొంటున్నవే. ఓవైపు ఇదంతా దుర్మార్గమని చర్చ జరుగుతూనే వుంటుంది. మరోవైపు జరగాల్సింది జరుగుతూ వుంది. ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇదే సంస్కృతి పులుముకొంటే తప్ప “వివక్ష”ను రూపుమాపజాలమని ప్రభుత్వ వాదన. అట్లయితే ఒక్క ఇంగ్లీషు మీడియం మాత్రమే - ఎందుకు? మిగిలినవీ అమలు చేస్తేసరి.
రేపు కార్పొరేట్ స్కూళ్ళు మాత్రమే కావాలని జనం కోరవచ్చు. ప్రభుత్వ వ్యవస్థను రద్దుచేసి ఆ పనీ చెయ్యవచ్చు. ప్రశ్నిస్తే మీ మనవళ్ళు ఏ స్కూళ్ళలో చదువుతున్నారని ఎదురు దాడి చెయ్య వచ్చు. అసలిదంతా అక్కడికి దారి తీసేందుకేనా?
సరిచెయ్యాల్సింది వ్యవస్థను
అసలు విషయం మన ప్రాథమిక విద్యా వ్యవస్థ! పట్టుమని పాతిక శాతం స్కూళ్ళలోనైనా ఇద్దరికి మించిన టీచర్లు లేరు. రెండుకుమింఛిన గదులులేవు. ఒకరిద్దరు టీచర్లుంటే గొప్ప. ఏ ఆలనాపాలనా లేని, ఎవ్వరికీ పట్టని, దిక్కుమొక్కులేని వీధిబళ్ళ కన్నా ఘోరంగా వున్న వీటినుంచి ఏమాశించగలం? హైస్కూళ్ళ సంగతి వేరు. వాటికేదో ఒక రూపం వుంది. దాదాపు 1000 దాకా గురుకులాలూ ఇతరత్రా కూడా వున్నాయి. మరి ప్రైమరీ స్కూళ్ళ సంగతి ఇలా కాదే. ప్రస్తుతం “వేల ఖాళీలున్నాయి వీటిలో విద్యా వాలంటీర్లకు కూడా దిక్కులేదు. వీటినిలానేవుంచి మీడియం మార్చేస్తే మహాద్భుతం జరిగిపోతుందనడం పచ్చి మోసం! తెలుగు మీడియంలోనే అయిదేళ్ళు చదివినా అక్షరం ముక్కరాని పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారు? జారిపోతారు, పారిపోతారు, ముడుచుకుపోతారు, మూగ మొద్దుల్లా మారుతారు. ఇంతేగదా! అసలు సర్కారు వారికి కావల్సింది కూడా సరిగ్గా ఇదే. ఈ వర్గం చిన్నప్పుడే ప్రశ్నించడం, ప్రపంచాన్ని అర్ధం చేసుకోడంలో ఎంత ప్రమాదకరం? అందుకే గదా ఏ మాత్రం ఆలోచించ వీల్లేని సంస్కృతాన్ని ఇంటర్మీడియేట్ లో తలకెత్తింది.
☸అందరూ పేదల వ్యతిరేకులేనా?
మనం కోరుతున్నది మాతృభాషలో, పరిసర భాషలో చదువు ప్రారంభించి, ఇంగ్లీషును కొంతకాలం ఒక భాషగా నేర్పి, కొంత పట్టువచ్చాక కోరుకొంటే ఇంగ్లీషు మీడియంలోకి మార్చవచ్చునని ఇంగ్లీషు పెత్తనం సాగుతున్న దేశాల్లో తప్ప ప్రపంచమంతా చదువంతా మాతృ భాషలోనే వుంది. అంతదూరం కూడా మనం అడగడం లేదు. ఇంగ్లీషు కావాలనుకొంటే దానికోసం విధానం వుందని, అది రాజకీయంగా గాదు అకడమిక్ గా నిర్ణయించాలని మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రవీంద్రుడూ, కొఠారీలూ ఇదే అన్నారు. విద్యాహక్కు ఎన్‌సిఎఫ్, నూతన విద్యా విధానం, సకల కమీషన్లూ ఇదే చెబితే వీళ్ళందరినీ పేదలు ద్రోహులకింద లెక్కించేస్తే ఏమనాలి? ఇన్ని దొంతరల స్కూళ్ళు పెట్టి, ఇప్పటికీ దళితుల్ని ఊరిబయట బళ్ళలోనే కూచోపెట్టి, వివక్షను ఏ దేశంలో లేనంతగా విద్యారంగంలో తిష్ట వేసింపజేసి, సామాజిక అసమానతల్ని చదువుల ద్వారా సుస్థిరం చేస్తున్న పాలక ప్రభువులా ఈ మహానుభావులందర్నీ వెక్కిరించేది? ఎంత దుస్సాహసం! ఎంత కుతర్కం? ఇంత సవాళ్ళు విసిరేవారు. కామన్ స్కూల్ నెందుకు తేలేకున్నారు? పేదలపక్షపాతులు కామన్ స్కూల్ నీ, కనీసం పంచాయితీకొక ప్రాథమిక స్కూల్ నీ ఎందుకు కోరరు?
కొందరు అమాయకంగా అలానైనా మన బడికి పిల్లలొస్తారే మోనని టీచర్లు దీన్ని సమర్ధిస్తున్నారు. మరికొందరు పేరుకు ఇంగ్లీషు మీడియం అయినా చెప్పేది తెలుగులోనేగదా అని లౌక్యం ప్రదర్శిస్తున్నారు. 'ఊరుకొంటేసరి జరగాల్సింది జరుగుతుంది. కొత్త నష్టాలు వచ్చేది లేదు. కొత్త లాభాలు ఒరిగేదీలేదు అన్నది ఇంకొందరి గడసరితనం. తీవ్ర నష్టం తెస్తుందని తెలుసు. మారుమూల గిరిజన పిల్లల్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకొంటే బడిలోకి అడుగు పెట్టగానే ఇంగ్లీషులో వారెంత సతమవుతారో తెలుస్తుంది. పై తరగతుల్లో మీడియం మారడానికి మేము చాలా కష్టపడ్డామనే వారు బడిలోకి వచ్చీరాక ముందే అమ్మ భాషా మాధ్యమనుంచి ఇంగ్లీషులోకి మారడంలో పసి పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో మాత్రం ఆలోచించడం లేదు.
☸భాష నేర్పడం చేతగాక!
అసలీ గొడవంతా మనం భాష నేర్పే విధానం నుంచి వచ్చింది. శక్తివంతంగా ఇంగ్లీషునొక భాషగా ప్రాథమిక దశ నుంచి నేర్చే విధానం మన వద్ద వుండి వుంటే పరిస్థితి మరోలా వుండేది. ఇంగ్లీషును ఇంగ్లీషుగా నేర్పడం చేతగాక ఒక మాధ్యమంగా మారిస్తేనే ఇంగ్లీషు ఒంటబడుతుందని తీర్మానించి ఈ కష్టాలు మనం తెచ్చుకొన్నాం.
👉దీనిపై జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం 2005 ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి.
☸ఇంగ్లీషు : ఒక సబ్జెక్టా లేక మాధ్యమమా?
"ఒకటవ తరగతినుంచే ఇంగ్లీషు మాధ్యమంలో నేర్పించాలని వస్తున్న డిమాండు కేవలం నూతన ఆకాంక్షలవల్లనో, మారిన రాజకీయ పరిస్థితులవల్లనో వచ్చింది గాదు. ఇప్పుడు మనం ఇంగ్లీషు నేర్పుతున్న విధానం, మనం వాడుతున్న పాఠ్య ప్రణాళికలు కూడా దీనికి కారణాలు. ఇంగ్లీషు బోధనకు సంబంధించి మన అధ్యయన సంస్థలు చేస్తున్న పరిశోధనల వైఫల్యం కూడా దీనికి కారణమే. నాల్గవ తరగతి నుంచి 10వ తరగతి దాకా మనం ఇంగ్లీషు నేర్పుతున్నాం. మనం పాటించే పద్ధతులవల్ల ఇంగ్లీషు ధారళంగా వచ్చి ఉంటే పై డిమాండు వచ్చి వుండేదే కాదు. మన పరిశోధన అంతా ఇంగ్లీషు మాధ్యమంగా చదువుకొనే మధ్యతరగతి వర్గపు స్కూళ్ళ అవసరాల పైనే జరిగింది. ప్రాంతీయ భాషా మాధ్యమాల స్కూళ్ళలో రెండో భాషగా నేర్పే ఇంగ్లీషు మీద జరగలేదు. ఇంగ్లీషు కోసం వస్తున్న డిమాండు న్యాయమైందని మనం అంగీకరిస్తే మనం దీనికి తగ్గ బోధనా వ్యూహాన్ని పాఠ్యప్రణాళికను వెంటనే రూపొందించు కోవాలి. ఇంగ్లీషు నేర్పడంలో రాబోయే అయిదారేళ్ళలో గనుక మనం చెప్పుకోదగ్గ విజయం సాధించకపోతే అన్ని స్కూళ్ళు ఇంగ్లీషు మీడియంలోనే ఉండాలనే రాజకీయ డిమాండు ముందుకొచ్చి తీరుతుంది. తమ పిల్లలకు ఇంగ్లీషులో నైపుణ్యం ఉండి తీరాలని, తమ ఆకాంక్షలకు; ఆశలకు ఇంగ్లీషు ఒక అడ్డంకిగా మారకూడదనీ, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ప్రభుత్వానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది.”
పాపం పేద పిల్లలు!
ఇప్పుడిక 'తాంబూలిచ్చేశాం' అనే దశలోకి మనం చేరుకొన్నాం. కొత్త పుస్తకాలు తయారవుతున్నాయి. టీచర్లకి శిక్షణలు, పిల్లలకి బ్రిడ్జి కోర్సులు సిద్ధమవుతున్నాయి. కొత్త టీచర్లు ఇంగ్లీషు మీడియం వారే రానున్నారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో తెలుగుకు ఏ గౌరవం, ఏ స్థానం వుంటుందో మనకు తెలుసు. ఇదే గతి మన స్కూళ్ళలోనూ తెలుగుకు పట్టనుంది. టీచర్లు ఇంగ్లీషుతో కుస్తీ పట్టడం చూడముచ్చట కాబోతుంది. దీంతో మన స్కూళ్ళలోకి ఇంగ్లీషు వచ్చి మన పిల్లల్ని ఏ గట్టు ఎక్కిస్తుందో ఊహించడం మనకేమీ పెద్ద సమస్య గాదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ని ప్రయోగాలు మన స్కూళ్ళలో ఏమయ్యా యో మనకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఈ తత్వం తెలిసి మన పద్దతి మనం ఎంచుకొంటాం. పైకి ఇంగ్లీషు మీడియం, లోపల తెలుగు బోధన సాగుతుంది. పరీక్షలు ఎలాగో ఒకలాగున జరుగుతాయి. పైకి ఇంగ్లీషు మీడియం, లోపల తెలుగు బోధన సాగుతుంది. పరీక్షలు ఎలాగో ఒకలా ఇంగ్లీషులో రాసేస్తారు. మార్కులు వాటికవే వస్తాయి. పిల్లలు రెంటికీ చెడ్డరేవళ్ళవుతారు. ఇంటి దగ్గర ఏ సహకారం వుండదుగాబట్టి, బడినుంచి పారిపోతారు. పాపం టీచర్లకూ ఇంగ్లీషు రాదుగాబట్టి మిగిలినవారు అయిదేళ్ళూ పూర్తి చేసి ఎవరిదారి వారు వెతుక్కొంటారు! ఏలినవారు కొంతకాలానికి ఓ కమిటీని వేస్తారు. సర్వేలు జరుపుతారు. పాపం భళ్ళున బయటపడుతుంది. దీన్ని టీచర్ల మీదికి ఎత్తుతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద దాడికి శస్త్రాస్త్రాలు సిద్ధమవుతాయి. ఏం చేసినా ఇది బాగుపడదని తీర్మానిస్తారు!
దీన్ని మనం చూస్తూ వుండాల్సిందేనా? పేద పిల్లలవైపునుంచి మనం చూడ్డం మరిచిపోతే తటస్థతా, మౌనముద్రా, అప్రయత్నాం గీకారాలూ ఒంటబట్టించుకొంటే పాపం వారేమతారు? రేపు దీనికి ప్రభుత్వాన్నే బాధ్యత చేస్తే చరిత్ర ఊరుకొంటుందా? కాలం మనల్ని మాత్రం నేరస్థులుగా నిలబెట్టదా?
0 Comments:
Post a Comment