అమ్మఒడి సొమ్ముపై... ప్రైవేటు కన్ను!
ప్రభుత్వ సాయాన్ని వాడొద్దు.. ఫీజులకే జమ చేయండంటూ...
చిత్తూరు డీఈవో పేరుతో నకిలీ రసీదుల ముద్రణ
పిల్లలకు ఇచ్చి పంపిన ఓ ప్రైవేటు పాఠశాల
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘అమ్మఒడి’ సాయాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజుల రూపేణ సొమ్ము చేసుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తల్లుల ఖాతాలకు జమైన ఈ మొత్తాన్ని ఇతరత్రా ఖర్చులకు వెచ్చించకూడదని బెదిరింపులకు దిగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి సాయాన్ని విద్యార్థి విద్యాభివృద్ధి కార్యక్రమాలకే వెచ్చించాలని స్పష్టం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఈ మొత్తాన్ని పిల్లల ఫీజులకు జమచేయాలని ఏకంగా ఓ స్లిప్ పిల్లల చేతికి ఇచ్చి పంపడం చర్చనీయాంశమైంది. ఈ తరహా ఆదేశాలు చిత్తూరు జిల్లాలో ఇచ్చారని అక్కడి డీఈవో పేరు మీద ఉన్న రసీదు నకలును విద్యార్థులకు అందజేయడం గమనార్హం.
అమ్మఒడి సొమ్మును బడి ఫీజుల కింద జమ చేయించాలనే అభిప్రాయం గుంటూరులోని కొన్ని విద్యాసంస్థలదేనని, అయితే ఇది తమ మెడకు చుట్టుకోకూడదని చిత్తూరు డీఈవో పేరు వాడినట్టుగా గుంటూరు జిల్లా విద్యాశాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ప్రైవేటు విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు.. అయితే గురువారం పిల్లలు ఇంటికి వెళ్లేటప్పుడు గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ వారు చిత్తూరు డీఈవో ఇచ్చిన రసీదును పిల్లల దైనందినికి పిన్ కొట్టి పంపారు. దాన్ని ఇంటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు చూపించడంతో వారు అవాక్కయ్యారు. ఆ రసీదులో ఈ మొత్తం సాయాన్ని ఇతరత్రా ఖర్చులకు వెచ్చించకూడదు.. ప్రభుత్వం ఇది చదువుల కోసం ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్ని ఈనెల 11వ తేదీ లోపు చెల్లించి రసీదు పొందాలని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఫీజుల కింద చెల్లించినట్టు తాము తిరిగి ఈనెల 12న ‘ఆన్‌లైన్’లో ప్రభుత్వానికి ‘అప్‌లోడ్’ చేయాల్సి ఉంటుందని ఆ రసీదులో ఉంది. ఇలా చేయనివారికి రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతాలు నిలిచిపోతాయని (స్తంభిస్తాయని) పేర్కొన్నారు.
అవి చిత్తూరు డీఈవో ఇచ్చిన ఆదేశాలు కాదు..
- ఆర్.ఎస్.గంగాభవానీ, జిల్లా విద్యాశాఖ అధికారిణి, గుంటూరు
నగరంలో ఓ పాఠశాల ఈ రకమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవానీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె స్పందించి వెంటనే చిత్తూరు డీఈవోతో మాట్లాడారు. ఈ రకమైన ఆదేశాలు తాను చిత్తూరు జిల్లాలో ఇవ్వలేదని సమాధానం వచ్చింది. దీంతో ఇది కొందరు ప్రైవేటు యాజమాన్యాల పనేనని డీఈవో చెప్పారు.
ఖాతాలకు జమైనట్టు తెలుసుకోవడానికి..
ప్రభుత్వం ఇప్పటివరకు ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడానికి ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అయితే తల్లుల ఖాతాకు జమయ్యాయా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వమే ముఖ్యమంత్రి సంతకం చేసిన ఒక ప్రొఫార్మాను ముద్రించి పంపారు. అందులో ‘ప్రభుత్వం అమ్మఒడి సాయం మీకు జమచేసింది.. అవి అందాయా..? అందితే మీరు సంతకం చేసి వార్డు వాలంటీర్‌కు అందజేయాల’ని మాత్రమే ‘ఎక్‌నాలెడ్జిమెంట్’ వాలంటీర్లకు పంపిణీ చేశామని డీఈవో గంగాభవానీ తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు అమ్మఒడి సాయాన్ని ఫీజుల కింద చెల్లించాలని ఒత్తిడి చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0 Comments:
Post a Comment