నగదు చెల్లిస్తే టోల్ రాయితీ కట్
ఫాస్టాగ్ పెంచడానికి కేంద్రం నిర్ణయం
ఫాస్టాగ్‌తోనే స్థానికులకూ వెసులుబాటు
రాష్ట్రంలోని రెండు టోల్‌ప్లాజాల్లో ఇంకో నెలపాటు హైబ్రిడ్ వరసలు
మరో 30 రోజులపాటు 25% అవే
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు అనువుగా నగదు చెల్లింపుదారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వెళ్లిన మార్గంలో 24 గంటల్లో తిరిగి వస్తే టోల్‌ట్యాక్స్‌లో తిరుగు ప్రయాణానికి 50% రాయితీ ఇచ్చే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఇకపై దాన్ని పొందాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందేనని, టోల్‌ట్యాక్స్‌ను నగదు రూపంలో చెల్లించే వారికి రాయితీ వర్తించదని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. టోల్‌ప్లాజాల పరిసరాల్లో ఉన్నవారికి జారీచేస్తున్న నెలవారీ పాసులు, ఇతర రాయితీలు వర్తించాలన్నా ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
నగదు చెల్లిస్తే టోల్ రాయితీ కట్
మరో నెల 25% హైబ్రిడ్ వరసలు
తెలంగాణలోని రెండు టోల్‌ప్లాజాల వద్ద మరో నెలపాటు 25% హైబ్రిడ్ వరసలుగా అనుమతిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులిచ్చింది. గత నెల 15 నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో వసూలుచేసే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 65 టోల్‌ప్లాజాల పరిధిలో నగదు వసూళ్లు అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మార్గాల వాహనదారులకు అసౌకర్యం కలగకుండా మరో నెలపాటు టోల్‌ప్లాజాల పరిధిలోని 25% వరసల్లో నగదు, ఫాస్టాగ్‌లను అనుమతించేందుకు వీలుగా హైబ్రిడ్ మార్గాలను కొనసాగించాలని నిర్ణయించింది. హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్ 65) మార్గంలోని పంతంగి, హైదరాబాద్-బెంగళూరు(ఎన్‌హెచ్ 44) మార్గంలోని రాయికల్ టోల్‌ప్లాజాల వద్ద 25% వరసలను హైబ్రిడ్‌గా కొనసాగించాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన 16 టోల్‌ప్లాజాల వద్ద నగదు కోసం ఒక్క వరస మాత్రమే కేటాయించారు.
0 Comments:
Post a Comment