75 శాతం హాజరు ఉండాల్సిందే: సీబీఎస్‌ఈ
పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు తప్పనిసరి
దిల్లీ: ఈ సంవత్సరం 10, 12 తరగతుల పరీక్షలు రాయనున్న విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయటానికి అనర్హులని బోర్డు స్పష్టం చేసింది. 2020 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల హాజరును లెక్కించాల్సిందిగా పాఠశాలలను సీబీఎస్‌ఈ ఆదేశించింది.సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించే 10,12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాజరుతో సహా అన్ని రకాలుగా అర్హులైన విద్యార్థులకే హాల్‌టికెట్లు జారీ చేస్తామని బోర్డు తెలిపింది. హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల జాబితాను ప్రాంతీయ కార్యాలయాల్లో అందజేయాలని సీబీఎస్‌ఈ బోర్డు పాఠశాలలకు సూచించింది. కాగా, హాజరు తగ్గటానికి సరైన కారణాలుంటే వాటిని నిరూపించే పత్రాలను విద్యార్థులు జనవరి 7లోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని బోర్డు ఆదేశించింది. వారి విషయంలో జనవరి 7లోగా అంతిమ నిర్ణయాన్ని తీసుకుంటామని అధికారులు చెప్పారు. అంతిమ గడువు దాటిన తరువాత అందే వినతులను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment